రాజన్న రాజ్యమే లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. ఇందులో భాగంగా పార్టీ పేరును ప్రకటించేందుకు.. పార్టీ ఎజెండాను ప్రకటించేందుకు ఆమె శుక్రవారం ఖమ్మంలో సంకల్ప సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఓ వైపు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలూ సాగుతున్నాయి. సంకల్ప సభ పోస్టర్లు, బ్యానర్లను షర్మిల పార్టీ నాయకులు ఇదివరకే విడుదల చేశారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లడానికి ఉద్దేశించిన రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. అయితే.. ఈ సంకల్ప సభకు షర్మిల తల్లి విజయమ్మ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక ఆహ్వానితురాలిగా వైఎస్ విజయమ్మ ఈ సభకు హాజరవుతారని తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ వ్యవహరిస్తున్నారు. తన కుమార్తె రాజకీయ అరంగేట్రం చేయబోతుండటం.. తెలంగాణ గడ్డ మీద తొలిసారిగా బహిరంగ సభను నిర్వహిస్తుండటం వంటి పరిణామాల మధ్య కుమార్తెకు దన్నుగా నిలవాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్ నివాసానికి వస్తారని, ఆ మరుసటి రోజు ఖమ్మం బయలుదేరి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
తమ కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు గానీ, భేదాభిప్రాయాలు గానీ లేవంటూ ఇటీవలే విజయమ్మ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. దాన్ని నిజం చేయడంలో భాగంగా- వైఎస్ జగన్ తరఫున.. ఆయనకు చెందిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ ఖమ్మం సంకల్ప సభకు హాజరవుతారని చెబుతున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీకి ఎలాంటి సహాయ, సహకారాలు గానీ, రాజకీయంగా అండదండలు అవసరమైనా తాము అందజేస్తామనే సందేశాన్ని ఈ సందర్భంగా వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఇదిలావుండగా ఖమ్మంలో షర్మిల నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఇతర పార్టీల్లో కొనసాగుతున్న కొందరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం పరోక్షంగా షర్మిల సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారనే ప్రచారం ఖమ్మంలో సాగుతోంది. పార్టీ విధివిధానాలు, మార్గదర్శకాలను ప్రకటించిన తరువాత.. భారీ ఎత్తున చేరికలు ఉండొచ్చని షర్మిల పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. షర్మిల పార్టీ ప్రకటన కాకముందే ఆమె పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు సంగీతా రెడ్డి, గొల్ల కురుమ యువజన సంఘం తెలంగాణ అధ్యక్షుడు కడారి స్టాలిన్ యాదవ్ వైఎస్ షర్మిలను కలిశారు. ఇదివరకే గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్ షర్మిల పార్టీలో చేరారు. సోమవారం ఆమె లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. కరీంనగర్, నారాయణ్‌పేట్ జిల్లాలకు చెందిన పలువురు వేర్వేరు పార్టీల నాయకులు షర్మిలకు మద్దతు ప్రకటించారు.