ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచాడు. గంటల వ్యవధిలోనే రెండు సీఐడీ కేసులను నమోదు చేయించి జోరు పెంచాడు. చంద్రబాబు నాయుడు హయాంలోని ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు రెడీ అయ్యారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోని అవకతవకలపై గంట ల వ్యవధిలోనే మరో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది.
తాజాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపైనా సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు వెలువడ్డాయి. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారంటూ రెండు కంపెనీలపై దర్యాప్తు కోరారు. దాదాపు 241.78 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు ఈ అవకతవకలకు పాల్పడినట్లు ఏపీ సర్కార్ సదురు కంపెనీలపై అభియోగాలు మోపింది.
ప్రభుత్వ వాటా అయిన రూ.370.78 కోట్ల రూపాయల నుంచి ఈ మొత్తం తరలించినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా ఇది గుర్తించి ప్రభుత్వానికి తెలిపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అడిషనల్ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.
గత టీడీపీ పాలకుల్లోని చిన్నాపెద్ద అందరి పేర్లు బయటకొస్తాయని .. ఏపీ ఫైబర్ నెట్ తీగ లాగితే డొంక మొత్తం కదలడం ఖాయమంటున్నారు.వందల కోట్ల అవినీతి అయితే ఇది సీఐడీ విచారణలో బయటకొస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి గౌతంరెడ్డి సైతం ఈ ఫైబర్ నెట్ స్కామ్ లో రూ.700 కోట్ల నుంచి రూ.1000 కోట్లు అవినీతి జరిగిందని వెల్లడించారు. ఈ స్కామ్ లో ప్రధానంగా మాజీ మంత్రి నారా లోకేష్, ఆయన ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణపై ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దిరిని బుక్ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.