గుర్తింపు కోసం ఈ ప్రపంచం పడే ఆరాటం.. అంతా ఇంతా కాదు. అయితే.. అది లేనప్పుడు ఈ సమాజం ఒకలా ఉంటుంది. వచ్చిన తర్వాత మరో విధంగా ఉంటుంది. కొందరు మాత్రమే దీనికి భిన్నంగా ఎప్పుడూ ఒకేలా ఉంటారుగానీ.. మెజారిటీ జనం ఇదే పద్ధతిలో ఉంటారు. ఇదే కోవలో ఒక దర్శకుడు రాజమౌళిని పొట్టోడా అని పిలిచేవాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి వెల్లడించారు. మరి, ఆయన ఎవరు? ఆ కథ ఏంటన్నది చూద్దాం.
రాజమౌళి ప్రస్థానం ఎక్కడ మొదలైందంటే.. చాలా మంది ‘శాంతి నివాసం’ నుంచి అంటారు. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ ఎంత హిట్ కొట్టిందో అప్పటి టీవీ ప్రేక్షకులకు అందరికీ తెలుసు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద శిష్యరికం చేసిన తర్వాత ముందుగా ఈ సీరియల్ తీశారు జక్కన్న. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తెరకెక్కించారు. అయితే.. అందరికీ తెలియని విషయం ఏమంటే.. రాఘవేంద్రరావు కన్నా ముందు.. మరో దర్శకుడి వద్ద కూడా అసిస్టెంట్ గా వర్క్ చేశారు రాజమౌళి.
ఆ డైరెక్టర్ పేరు క్రాంతి కుమార్. ఈయన దగ్గర పనిచేస్తున్నప్పుడు, త్రికోటి అనే మరో వ్యక్తి కూడా అసిస్టెంట్ గా ఉన్నారు. ఆయన రాజమౌళి సీనియర్. ఏడేళ్ల క్రితం నాగశౌర్య హీరోగా వచ్చిన ‘‘దిక్కులు చూడకు రామయ్య’’ అనే చిత్రాన్ని త్రికోటినే తెరకెక్కించారు. ఈ దర్శకుడు రాజమౌళిని అప్పట్లో పొట్టోడా అని పిలిచేవాడట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. త్రికోటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అప్పుడు.. ఏ విషయం చెప్పాలన్నా పొట్టోడా అని పిలిచేవాడట త్రికోటి. దీనికి రాజమౌళి.. ‘‘అదేంటీ ఇద్దరమూ ఒకే హైట్ కదా.. నన్నెందుకు పొట్టోడా అని పిలుస్తున్నాడు’’ అని అనుకునేవాడట. ఒక రోజు అమీర్ పేట్ లోని శీష్ మహల్ లో సినిమాకు వెళ్లివస్తూ.. ఈ విషయం అడిగాడట. దానికి ‘‘పొట్టాడా అంటే.. చిన్నోడా అని అర్థం’’ అని చెప్పారట త్రికోటి. ఈ విషయం చెప్పి నవ్వులు పూయించాడు జక్కన్న.
సీన్ కట్ చేస్తే.. త్రికోటి ఇప్పుడు రాజమౌళి దగ్గరే అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. దిక్కులు చూడకు రామయ్య చిత్రం సక్సెస్ కాకపోవడంతో.. రాజమౌళి ఆయన్ను పిలిచి, అసిస్టెంట్ పనులు చూసుకోవాలని కోరాడట. అప్పటి నుంచి ఆయన జక్కన్న దగ్గరే వర్క్ చేస్తున్నారట. అయితే.. అప్పట్లో పొట్టోడా అని పిలిచిన త్రికోటి.. ఇప్పుడు అలా పిలవలేడు కదా? అందుకే.. అందరి ముందు సార్ అని పిలుస్తారట. సింగిల్ గా ఉన్నప్పుడు ‘మౌళి’ అని పిలుస్తారట. సక్సెస్సా.. మజాకా..??