
రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ ఉప్పూనిప్పులా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు నచ్చదు. చంద్రబాబు ఏవైనా సూచనలు చేస్తే ఆ సూచనలు జగన్ కు నచ్చవు. అయితే తాజాగా జగన్ మాత్రం టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ తగ్గించే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మూడు రాజధానుల బిల్లు విషయంలో శాసన మండలి వ్యవహరించిన తీరు నచ్చక జగన్ కొన్ని నెలల క్రితం శాసన మండలి రద్దు దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే.
జగన్ సర్కార్ తీర్మానం చేసి మూడు రాజధానుల బిల్లు ఆమోదం కోసం కేంద్రానికి బిల్లును పంపించగా వేర్వేరు కారణాల వల్ల కేంద్రం ఈ బిల్లు విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత కరోనా, లాక్ డౌన్ వల్ల శాసన మండలి రద్దు తీర్మానం ఊసే లేకుండా పోయింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ సమావేశంలో శాసనమండలి రద్దు తీర్మానం చర్చకు వస్తుందా….? అంటే రాదనే సమాధానం వినిపిస్తోంది.
మరోవైపు శాసన మండలి రద్దు విషయంలో అప్పటికీ ఇప్పటికీ జగన్ తీరు మారింది. జగన్ తన సన్నిహితులతో ప్రస్తుత పరిస్థితుల్లో శాసన మండలి రద్దు జరగకపోయినా నష్టం లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. మరోవైపు శాసనమండలి రద్దు కాకపోతే వైసీపీకే ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు గవర్నర్ ఆమోదంతో మండలికి, మూడు రాజధానుల అంశానికి సంబంధం లేకుండా పోయింది.
కేంద్రం ఇప్పటికే రాష్ట్ర రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పిన నేపథ్యంలో జగన్ మండలి రద్దు అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వచ్చే సంవత్సరం నాటికి మండలిలో వైసీపీ బలం పెరుగుతుండటం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. చంద్రబాబు తనయుడు లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్సీ పదవుల వల్లే వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ పట్టు సడలించడంతో చంద్రబాబుకు మండలి టెన్షన్ తగ్గిందనే చెప్పాలి.