AP IAS Officers Promotions: కోర్టు ధిక్కార అధికారులకు ప్రమోషన్లు.. ఏపీలో అంతే

ఎంటీ కృష్ణబాబు, అనిల్ కుమార్ సింఘాల్ , గోపాలకృష్ణ ద్వివేదీలు సీనియర్ ఐఏఎస్ అధికారులు. అయితే అంతకంటే సీనియర్లు ఉన్నా.. ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కేడర్ ను మార్చి పదోన్నతులు కల్పించారు.

Written By: Dharma, Updated On : May 9, 2023 11:01 am

AP IAS Officers Promotions

Follow us on

AP IAS Officers Promotions: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా అన్నట్టుంది జగన్ సర్కారు దుస్థితి. తమకు అక్కరకు వచ్చారని.. అక్కరకు వస్తారని తెలిస్తే అందలమెక్కిస్తారు. లేకుంటే మాత్రం పక్కన పడేస్తారు. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి.అధికారులతో పాటు సొంత పార్టీ నేతలకు ఈ విషయంలో ఎదురైన అనుభవాలు ఎక్కువే. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్లు ఇచ్చింది. అయితే విశేషమేమిటంటే ముగ్గురు కూడా ప్రభుత్వానికి వీర విధేయులే. ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను అమలుచేసి వారే. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగిన వారే. ఇప్పుడు వారి ప్రభుత్వ తీరును చూసి ఏపీ సర్కారు పదోన్నతులు ఇచ్చిందన్న మాట.

కేడర్ మార్చి..
ఎంటీ కృష్ణబాబు, అనిల్ కుమార్ సింఘాల్ , గోపాలకృష్ణ ద్వివేదీలు సీనియర్ ఐఏఎస్ అధికారులు. అయితే అంతకంటే సీనియర్లు ఉన్నా.. ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కేడర్ ను మార్చి పదోన్నతులు కల్పించారు. ఈ హోదాతోనే ప్రస్తుతం ఉన్న స్థానాల్లో పని చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సింఘాల్ రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్నారు. మిగతా ఇద్దరు మాత్రం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్పినా నిబంధనలు కూడా చూసుకోకుండా పాటించడమే ధ్యేయంగా పనిచేస్తుంటారన్న అపవాదు వీరిపై ఉంది.

కోర్టులో కేసులు..
అయితే ఈ నలుగురు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిపై కోర్టు ధిక్కరణ కేసులు సైతం నడుస్తున్నాయి. కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్లారు. గత వారమే ఎంటీ కృష్ణబాబుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తారో లేకపోతే.. డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేసుకుని బయటపడతారో తెలియదు కానీ.. ఆయనకు శిక్ష అయితే కోర్టు విధించింది. గతంలో అనిల్ కుమార్ సింఘాల్, గోపాలకృష్ణ ద్వివేదీలూ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. అయితే డివిజన్ బెంచ్‌కు వెళ్లి ఎలాగోలా బయట పడ్డారు.

ఇదో రకం గుర్తింపు
అయితే ఇలా ఎంతలా నిబంధనలను పాటించకుండా పాలన సాగిస్తే అంతలా జగన్ సర్కారు అధికారులను గుర్తిస్తోంది. ప్రమోషన్లు కూడా ఇస్తుంది కాబట్టి ఇక తాము ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా అధికారుల తీరు ఉంది. అందుకే.. పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి ఈ ముగ్గురు అధికారులు ఎన్ని సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారో రికార్డుల పరంగా చూస్తే ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకూడదు. కానీ ప్రభుత్వం కోసం వారు పరితపించారు కనుక వారికి కచ్చితంగా ఏదో స్వాంతన చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రమోషన్లు ఇచ్చి తన ఉదారతను చాటుకుంటోంది.