నాకు వద్దు మొర్రో టీటీడీ చైర్మన్ పదవి అని ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం జగన్ బాబాయ్ ‘వైవీ సుబ్బారెడ్డి’ మొత్తుకున్నారు. తనకు ప్రజాసేవ చేయాలని అనిపిస్తోంది.. ప్రజల్లో ప్రజాప్రతినిధిగా ఆ హోదా, పరపతి, పనులు చేస్తే ఆ కిక్కే వేరు అని అన్నాడు. ఈ మేరకు జగన్ ను తనకు ఏదైనా రాజ్యసభ, ఎమ్మెల్సీ సీటు కోసం అడుగుతానని అన్నాడు.
కానీ బాబాయ్ వైవీ ఒకటి తలిస్తే.. సీఎం జగన్ మరొకటి తలచాడు. బాబాయ్ వద్దన్న టీటీడీ చైర్మన్ పదవినే కట్టబెట్టాడు. వద్దు అన్నపదవినే రెండోసారి ఇచ్చాడు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
మాజీ ఎంపీ, టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జగన్ నిర్ణయాన్ని జీర్ణించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల వేళ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీటు త్యాగం చేస్తే టీటీడీ చైర్మన్ పదవిని జగన్ అధికారంలోకి వచ్చాక కట్టబెట్టారు. అది రెండేళ్లకే అయిపోయింది. దీంతో పదవీ కాలం పొడిగింపు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ చైర్మన్ పదవి మళ్లీ వైవీకే కట్టబెట్టారు. సుబ్బారెడ్డి మనసు ప్రత్యక్ష రాజకీయాలవైపు మళ్లీ జగన్ మాత్రం ఇటు వైపు రానీయలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చైర్మన్ ను ప్రకటించినా బోర్డును మాత్రం ఆలస్యంగా నియమించారు. దీంతో సుబ్బారెడ్డికి తక్కువ రోజులే దక్కాయి.
రెండోసారి పదవి ఇవ్వడంతో సుబ్బారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ అందరిలో నెలకొంది.
సుబ్బారెడ్డిని సీఎం క్రమంగా దూరం పెడుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో బాలినేని-సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొద్ది రోజులుగా సఖ్యత లేకుండా పోతోంది. దీంతో మొదట్లో సుబ్బారెడ్డి హవా కొనసాగినా మెల్లగా బాలినేనిదే పైచేయిగా మారుతోంది. ఇప్పుడు మరోసారి టీటీడీ పదవి ఇవ్వడంతో వైవీ సుబ్బారెడ్డి యాక్టివ్ రాజకీయ భవిష్యత్ పై సందిగ్ధం నెలకొంది.