CM Jagan: బిజెపి విషయంలో జగన్ ఉద్దేశం ఏమిటి? రాష్ట్ర బిజెపిలో సగానికి పైగా చంద్రబాబు మనుషులే ఉన్నారంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతం? ఈ విషయంపై మాట్లాడారంటే కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసి అయినా ఉండాలి.. లేకుంటే కేంద్ర నాయకత్వమే ఈ విషయం జగన్ తో చెప్పి ఉండాలి. లేకుంటే బీజేపీ అంతర్గత విషయాలను జగన్ మాట్లాడి ఉండేవారు కాదు. దీని వెనుక బలమైన కారణాలు మాత్రం ఉన్నట్టు కనిపిస్తోంది.
ఏపీ బీజేపీలో వర్గాలు నడిచేవి. తెలుగుదేశం, వైసీపీ అనుకూల వర్గాలు ఉండేవి. తెలుగుదేశం తో పొత్తునకు ఒక వర్గం మొగ్గు చూపేది.. మరో వర్గం వ్యతిరేకించేది. అయితే పురందేశ్వరి అధ్యక్షురాలుగా నియమితులైన తర్వాత వైసిపి, టిడిపి లకు సమ దూరం పాటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె వస్తూ వస్తూనే వైసిపి పై పడ్డారు. వైసిపి సర్కార్ అవినీతిపై మాట్లాడుతున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. అదే సమయంలో టిడిపి అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పురందేశ్వరి దూకుడు పెంచారు. మద్యం లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేశారు.ఇప్పుడు ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఫిర్యాదులు చేశారు.
అయితే తాజాగా సీఎం జగన్ బిజెపిలో చంద్రబాబు మనుషులు ఉన్నారంటూ వ్యాఖ్యానించడం విశేషం. తెలుగుదేశం, జనసేన లతో బిజెపి జత కడుతుందని ఒక ప్రచారం మొదలైంది. బిజెపి పొత్తులకు సానుకూలంగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో బిజెపిలో ఓ కన్ఫ్యూజ్ వాతావరణాన్ని సృష్టించడానికి జగన్ ఎత్తుగడ వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బహిరంగ సభలో వ్యాఖ్యానించిన జగన్ ఈ విషయమై కేంద్ర ప్రజలకు సైతం ఫిర్యాదు చేసి ఉంటారు. వారంతా బీజేపీ మనుషులు కాదని.. చంద్రబాబు కోసం పరితపిస్తుంటారని కచ్చితంగా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి ఉంటారు. లేకుంటే బీజేపీ అంతర్గత విషయాలను ప్రస్తావించే సాహసం కూడా చేయరు.
సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉండేటప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉండేవారని ప్రచారం జరిగింది. బిజెపిలో చంద్రబాబు మనసులుగా ముద్ర పడిన వారంతా సోము వీర్రాజు పై కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు చేసేవారు.అయినా సరే హై కమాండ్ పెద్దలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. సోము వీర్రాజుకు రెండు సంవత్సరాల పాటు అదనంగా బాధ్యతలు అప్పగించారు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా ఆయనను పక్కనపెట్టారు. పురందేశ్వరి నియామకంతో చంద్రబాబు మనుషులు మరింత అలెర్ట్ అయ్యారు. అటు పురందేశ్వరి సైతం టిడిపి అనుకూల ధోరణితో ఉండడంతో వారికి కలిసి వచ్చింది. వారంతా ఇప్పుడు టిడిపితో పొత్తు కోసం కేంద్ర పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ చంద్రబాబు మనుషులంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.