Nara Lokesh: జాతీయస్థాయిలో లోకేష్ ను హీరో చేసిన జగన్

రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామితో లోకేష్ లైవ్ డిబేట్ కు కూర్చున్నారు. సాధారణంగా ఆర్నాబ్ తో డిబేట్ అంటే రాజకీయ పార్టీల నేతలు ముందుకు రారు.

Written By: Dharma, Updated On : September 16, 2023 10:05 am

Nara Lokesh

Follow us on

Nara Lokesh: లోకేష్ లో ఉన్న తెలివితేటలు బయటపడడానికి జగన్ కారణమవుతున్నారు. ఇన్నాళ్లు లోకేష్ ను తేలిగ్గా తీసుకున్న వారు సైతం.. ఆయనలో ఏదో ఒక విషయం ఉందన్న నిర్ణయానికి వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఫిర్యాదు చేసేందుకే లోకేష్ ఢిల్లీలో అడుగు పెట్టారని ప్రచారం సాగింది. కానీ లోకేష్ అడుగులు మరోలా ఉన్నాయి. చంద్రబాబు విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని లోకేష్ ఎండగడుతున్నారు. నేషనల్ మీడియాను వేదికగా చేసుకొని జగన్ సర్కార్ పై పెద్ద యుద్ధమే ప్రకటించారు.

చంద్రబాబు తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ చుట్టూ ఎన్నో రకాల వివాదాలు అల్లారు. చివరికి ఆయన వ్యక్తిత్వాన్ని సైతం కించపరిచారు. లేనిపోని నిందలు సైతం మోపారు. కానీ వాటన్నింటినీ అధిగమిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు దిగితే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో.. అన్ని చేశారు. అయినా సరే లోకేష్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగారు. ఇప్పుడు తండ్రి అక్రమ అరెస్టును ఢిల్లీ వేదికగా ఎండగట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామితో లోకేష్ లైవ్ డిబేట్ కు కూర్చున్నారు. సాధారణంగా ఆర్నాబ్ తో డిబేట్ అంటే రాజకీయ పార్టీల నేతలు ముందుకు రారు. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు. అటువంటిది లోకేష్ లైవ్ డిబేట్లో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దీటైన కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆర్నాబ్ అడిగారు. సిమెన్స్ సంస్థ 90 శాతం భరించడం, 19 రోజుల్లోనే డబ్బులు రిలీజ్ చేయడం గురించి ప్రశ్నించారు. అక్కడ ఏదో తప్పు జరిగిందనిలోకేష్ ను ఇబ్బంది పెట్టాలని చూసారు. కానీ వాటన్నింటికీ లోకేష్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి వివరించారు. గుజరాత్ లో సైతం సిమెన్స్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సంస్థ అందించేది నగదు సాయం కాదని.. సాఫ్ట్వేర్ తో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానం, సామగ్రిని అందిస్తుందని వివరించారు. మొత్తంగా ఆర్నాబ్ ఎంతగా ప్రయత్నించినా లోకేష్ బ్యాలెన్స్ తప్పలేదు. స్పష్టంగా మాట్లాడారు. బలమైన వాదనను వినిపించారు.

ఈ కేసు విషయంలో సీఎం జగన్తో చర్చకు సిద్ధమా? అని ఆర్నాబ్ అడిగితే మరో మాట లేకుండా లోకేష్ సిద్ధమని ప్రకటించారు. ఈ కేసు విషయంలో వైసీపీ నేతలతో ఎందుకు బహిరంగ చర్చకు రావడం లేదని ఆర్నాబ్ ప్రశ్నించారు. దీనికి సైతం లోకేష్ తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ” బుర్ర తక్కువ వాళ్లతో.. అన్నీ తెలిసి తెలియనట్లుగా మాట్లాడే వాళ్ళతో ఏం మాట్లాడతామని ప్రశ్నించారు”. సీఎం జగన్తో చర్చకు మీరు సిద్ధమా అని ఆర్నాబ్ అడిగేసరికి.. మరో మాటకు తావు లేకుండా సిద్ధం అని ప్రకటించారు.తప్పుడు కేసులు పెట్టి.. చట్టాలను వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే సివిల్ వార్ వస్తుందని.. దానికి సిద్ధపడతామని లోకేష్ బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఈ లోకేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేషనల్ మీడియాను వేదికగా చేసుకుని జగన్ సర్కార్ పై లోకేష్ ఫైర్ అవుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి కొన్ని జాతీయ మీడియా సంస్థలకు లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు లోకేష్ ప్రధాని మోదీ, అమిత్ షా లను కలవడం లేదని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే లోకేష్ ను జాతీయస్థాయిలో ఒక నాయకుడిగా నిలబెట్టిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుంది.