Palamuru Rangareddy Project: నేడు పాలమూరు ప్రారంభం.. ప్రాజెక్ట్ కథేంటి? ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారు?

ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హాజరయ్యే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు దాదాపు 4 వేల మందికి నాగర్‌కర్నూల్‌ పట్టణ శివార్లలోని మంతటి చౌరస్తా వద్ద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

Written By: Bhaskar, Updated On : September 16, 2023 10:12 am

Palamuru Rangareddy Project

Follow us on

Palamuru Rangareddy Project: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించబోతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద నిర్మించిన ఎల్లూరు పంపుహౌజ్‌లో తొలి పంపు వెట్‌రన్‌ను ప్రారంభించడం ద్వారా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పంప్‌హౌ్‌సలో మొత్తం 9 మోటార్లకు ఒక మోటారును సిద్ధం చేశారు. హైదరాబాద్‌ నుంచి 600 కార్లతో ర్యాలీగా వస్తున్న సీఎంకు పాలమూరు ఉమ్మడి జిల్లా సరిహద్దుల నుంచి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. సీఎం మధ్యాహ్నం 1.30 గంటలలోపు నాగర్‌కర్నూల్‌ చేరుకుంటారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హాజరయ్యే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు దాదాపు 4 వేల మందికి నాగర్‌కర్నూల్‌ పట్టణ శివార్లలోని మంతటి చౌరస్తా వద్ద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన్నే సీఎం కాన్వాయ్‌ నార్లాపూర్‌కు చేరుకుంటుంది. తొలుత పథకం ఇన్‌టెక్‌వెల్‌ను సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఉన్నతాధికారులు సందర్శిస్తారు. కృష్ణానది వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 2.30 గంటలకు నార్లాపూర్‌ వద్ద నిర్మించిన పంపుహౌజ్‌లో మొదటి పంపు వెట్‌రన్‌ను కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం పంపుహౌజ్‌, సర్జ్‌పూల్స్‌, అంజనగిరి రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. నార్లాపూర్‌ వద్ద నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్‌ను కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు. మళ్లీ రోడ్డుమార్గాన కొల్లాపూర్‌ పట్టణానికి చేరుకొని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఇంటి వద్ద తేనీరు సేవిస్తారు. అక్కడ మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో ముచ్చటించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్‌ పట్టణ శివారులో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. సభకు భారీ ఎత్తున సర్పంచ్‌లను, ప్రజలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సభకు వచ్చిన వారికి నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో ఎత్తిపోసిన నీటి కలశాలు చేతికి అందించనున్నారు. ఆ తర్వాత వీరితో ఈ నెల 17వ తేదీన ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో దేవతామూర్తుల పాదాలకు అభిషేకం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 4 వేల ఆర్టీసీ బస్సులను ఇందుకోసం కేటాయించారు. వీటికి తోడు ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను సిద్ధం చేసుకున్నారు.

ఒక్క మోటార్ తోనే వెట్ రన్

ఈ ప్రాజెక్టుకు 2015 జూన్‌ 11వ తేదీన కరివెన వద్ద సీఎం శంకుస్థాపన చేయగా… 18 ప్యాకేజీలుగా విభజించి… పనులు ప్రారంభించారు. నార్లాపూర్‌లో 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 మోటార్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తొలిదశలో రెండు మోటార్లను మాత్రమే పెడుతున్నారు. ఒక మోటార్‌ డ్రైరన్‌ ఇటీవలే విజయవంతంగా పూర్తయింది. ప్రాజెక్టులో మొత్తం 34 మోటార్లు బిగించనుండగా… అందుల్లో ఒక్కటి మాత్రమే పూర్తిస్థాయిలో సిద్ధమయింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రెండో దశ పర్యావరణ అనుమతికి కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన పర్యావరణ మదింపు కమిటీ సిఫారసు కూడా చేసింది. ఇక ప్రాజెక్టు డీపీఆర్‌ కేంద్ర జల సంఘం దగ్గర అనుమతి కోసం ఎదురు చూస్తోంది.