https://oktelugu.com/

India Vs Bangladesh: భారత్ వరుస విజయాలకు బంగ్లా బ్రేక్

టాస్ కోల్పోయి బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాను శార్దూల్‌, షమి ఆరంభంలోనే వణికించారు. అయితే కెప్టెన్‌ షకీబ్‌, తౌహిద్‌ అర్ధ సెంచరీలతో ఆదుకోగా టెయిలెండ్‌లో నసూమ్‌, మెహ్దీ హసన్‌ రాణించడంతో ఆ జట్టు సవాలు విసిరే స్కోరు చేయగలిగింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 16, 2023 / 09:59 AM IST

    India Vs Bangladesh

    Follow us on

    India Vs Bangladesh: భారత్ విజయాలకు బంగ్లా బ్రేక్ వేసింది. ఆసియా కప్ లో ఎదురు అన్నదే లేకుండా దూసుకు పోతున్న భారత జట్టుకు బంగ్లా దేశ్ కళ్ళెం వేసింది. ఇప్పటికే ఆసియా కప్‌ ఫైనల్‌ చేరిన టీమిండియాకు ఆఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తిరుగు లేని షాకిచ్చింది. బంగ్లా పేసర్లు, స్పిన్నర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు చురుకైన ఫీల్డింగ్‌ తోడైన వేళ..శుక్రవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులతో భారత్‌ను ఓడించింది. ఫలితంగా విజయంతో టోర్నీని ముగించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 265/8 స్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబ్‌ (80), తౌహిద్‌ (54) అర్థ శతకాలతో సత్తా చాటగా, నసూమ్‌ అహ్మద్‌ (44), మెహ్దీ హసన్‌ (29 నాటౌట్‌) రాణించారు. శార్దూల్‌ 3, షమి 2 వికెట్లు తీశారు. ఛేదనలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత సెంచరీ (133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 121)తో కదం తొక్కినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్‌ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) తుది కంటా పోరాడాడు. సూర్యకుమార్‌ (26) మోస్తరుగా ఆడాడు. ముస్తాఫిజుర్‌ 3, తన్జిమ్‌ హసన్‌, మెహ్దీ హసన్‌ చెరో 2 వికెట్లు సాధించారు.

    గిల్‌ వంద కొట్టినా..

    టీమిండియా ఇన్నింగ్స్‌లో గిల్‌ సొగసైన ఆటే హైలైట్‌కాగా..ఆఖర్లో అక్షర్‌ పోరాటం ఆకట్టుకుంది. కానీ మిగిలిన ప్రధాన బ్యాటర్లు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. తన్జిమ్‌ హసన్‌ సకీబ్‌ తన రెండో బంతికే రోహిత్‌ (0)ను అవుట్‌ చేసి అరంగేట్ర మ్యాచ్‌ను మరిచిపోలేనిదిగా చేసుకున్నాడు. ముస్తాఫిజుర్‌ వేసిన ఓవర్లో రెండు వరుస ఫోర్లతో గిల్‌ చెలరేగగా..తన్జిమ్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన తిలక్‌ వర్మ (5) వన్డే అరంగేట్రాన్నీ దూకుడుగానే చేసినట్టు కనిపించాడు. కానీ తన్జిమ్‌ బంతి స్వింగ్‌ను సరిగా అంచనా వేయలేక క్లీన్‌బౌల్డయ్యాడు. అయితే గిల్‌, రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. క్రమంగా ఈ జోడీ కదురుకుంటుండగా..18వ ఓవర్లో రాహుల్‌ (19)ను స్పిన్నర్‌ మెహ్దీ హసన్‌ అవుట్‌ చేశాడు. దాంతో 57 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు మెహ్దీ హసన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇక మెహ్దీ హసన్‌ బంతిని రివర్స్‌ స్వీప్‌ చేయబోయి ఇషాన్‌ కిషన్‌ (5) వికెట్ల ఎదుట దొరికిపోవడంతో 94 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ చేజార్చుకుంది. ఆపై సూర్యకుమార్‌, గిల్‌ 45 పరుగుల భాగస్వామ్యంతో పురోగమిస్తుండగా..సూర్యను బంగ్లా సారథి షకీబ్‌ అవుట్‌ చేశాడు. జడేజా (7) కూడా విఫలంకాగా..అక్షర్‌ తోడుగా గిల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈక్రమంలో 39వ ఓవర్లో శుభ్‌మన్‌ వన్డేల్లో ఐదో సెంచరీ పూరించాడు. పెరిగిపోతున్న రన్‌రేట్‌ను తగ్గించే ప్రయత్నంలో గిల్‌ భారీషాట్‌ కొట్టబోయి 44వ ఓవర్లో నిష్క్రమించాడు. తరుగుతున్న బంతులు, పెరుగుతున్న రన్‌రేట్‌తో ఒత్తిడి ఏర్పడినా.. తగ్గని అక్షర్‌ సమయోచిత షాట్లతో జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ 49వ ఓవర్లో ముస్తాఫిజుర్‌..అక్షర్‌ను అవుట్‌ చేయడంతో భారత్‌ ఆశలు అడుగంటాయి.

    బంగ్లాను ఆదుకున్నారు

    టాస్ కోల్పోయి బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాను శార్దూల్‌, షమి ఆరంభంలోనే వణికించారు. అయితే కెప్టెన్‌ షకీబ్‌, తౌహిద్‌ అర్ధ సెంచరీలతో ఆదుకోగా టెయిలెండ్‌లో నసూమ్‌, మెహ్దీ హసన్‌ రాణించడంతో ఆ జట్టు సవాలు విసిరే స్కోరు చేయగలిగింది. షమి వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతిని బౌండరీగా మలిచిన తన్జిద్‌.. ఆపై శార్దూల్‌ ఓవర్లో 4,4తో విజృంభించాడు. కానీ షమి తన రెండో ఓవర్లో లిటన్‌ దాస్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. నాలుగో ఓవర్లో ఓపెనర్‌ తన్జిద్‌ (13)ను బౌల్డ్‌ చేసిన శార్దూల్‌ ఆపై అనాముల్‌ (4)ను పెవిలియన్‌ చేర్చడంతో బంగ్లా 28/3తో నిలిచింది. ఇక తన మొదటి ఓవర్లోనే చక్కటి బంతితో మెహ్దీ హసన్‌ మిరాజ్‌ (13)ను రోహిత్‌ క్యాచ్‌తో అక్షర్‌ అవుట్‌ చేయడంతో షకీబ్‌ సేన మరోసారి కష్టాల్లో పడింది. ఈ దశలో తౌహిద్‌ జతగా షకీబ్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో అక్షర్‌ బౌలింగ్‌లో 6,6తో షకీబ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఐదో వికెట్‌కు 101 రన్స్‌ జతచేసి విసిగిస్తున్న ఈ జోడీని..షకీబ్‌ అవుట్‌తో శార్దూల్‌ విడదీశాడు. ఆ వెంటనే షమీమ్‌ హొసేన్‌ (1)ను జడేజా ఎల్బీడబ్ల్యూ చేయగా..అర్ధ శతకంతో జోరుమీదున్న తౌహిద్‌ను షమీ అవుట్‌ చేశాడు. ఆపై మెహ్దీ హసన్‌ (29 నాటౌట్‌) జతగా ఎనిమిదో వికెట్‌కు 45 రన్స్‌ జత చేసిన నసూమ్‌ 48వ ఓవర్లో ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.