నదీజలాల విషయం తెలుగు ప్రాంతాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. సీఎంలు జగన్, కేసీఆర్ మధ్య పెద్ద అగాధమే కలుగుతోంది. విమర్శలతో తమ మాటలతో యుద్దమే చేస్తున్నారు. ఇరు ప్రాంతాల్లో నేతలు తమ దూకుడు ప్రదర్శిస్తున్నారు. విమర్శలతో విద్వేషాలతో పలు విషయాలపై ఆసక్తికర అంశాలు చోటుచేసుకుంటున్నాయి. నదీజలాల విషయం కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో ప్రాజెక్టులపై రెండు ప్రాంతాలకు అధికారం లేకుండా పోయింది. నదీ జలాల బోర్డులు చెప్పినట్లు వినాల్సిందే.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబును ఉద్దేశించి పలు కామెంట్లు చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు స్టేట్ల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావు అర్థరాత్రి ఫోన్లో మాట్లాడుకుంటున్నారని దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు.
ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటున్నారని అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసిందెవరో తెలుసని అన్నారు. ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరో తెలుసని పేర్కొన్నారు. అలాంటి చరిత్ర కలిగిన తమరు నిందలు ఆపాదించడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అని ధ్వజమెత్తారు.
కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బాగా నిరాశ పడింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. జగడం ముదిరి మంటలు చెలరేగాలని తనవంతు ప్రయత్నం చేశారని ఆరోపించారు. జగన్ లేఖలపై తక్షణం స్పందించి గెజిట్ విడుదల చేయడంతో డీలా పడ్డారని పేర్కొన్నారు. శుభం పలకరా పెళ్లికొడకా అంటే అన్న సామెతలా ఉంది బాబు తీరని కామెంట్లు చేశారు.