
మన ఖ్యాతి మరోసారి విదేశీ గడ్డపై వెలిగింది. న్యూయార్క్ లో ఓ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరును పెట్టారు. ప్రముఖ మత గురువు, భాషా పండితుడు ధర్మాచార్య పండిట్ రామ్ లాల్ పేరుతో ఓ వీధికి నామకరణం చేయగా, క్వీన్స్ రిచ్ మండ్ హిల్ లో అధికారిక వేడుక నిర్వహించారు. గుయానా స్కెల్ డాన్ లో భారత మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగారు రామ్ లాల్. ఆయన అక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1979లో అమెరికా బ్రూక్లిన్ కు వెళ్లి అక్కడో ఆస్పత్రిలో పనిచేశారు. ఇండో-కరేబియన్ కమ్యూనిటీ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. గయానాలో ఉన్నప్పుడు టాగూర్ మెమొరియల్ స్కూల్ లో భారతీయ విద్యార్థులకు హిందీ బోధించేవారాయన. 2019లో 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. లిబర్టీ అవెన్యూ, 133వ వీధికి రామ్ లాల్ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్ నుంచి ప్రతిపాదనలు రాగా, జూన్ 27న న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో సంతకం చేశారు.