
CM Jagan: ఉత్తరాంధ్ర జిల్లాలను శాసించిన ఆ మంత్రుల్లో నిరాశకు కారణమేంటి? ఎప్పుడూలేనంతగా అసహనం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? సొంత పార్టీ శ్రేణులపైనే మండిపడుతున్నారెందుకు? ప్రజలను భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశమైంది. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే వారు నైరాశ్యంలోకి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా దక్కవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే వారు లోలోన అంతర్మథనం చెందుతూ ఆ కోపాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలపై చూపుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుల వ్యవహార శైలి ఇప్పడు అంతటా చర్చనీయాంశమవుతోంది.
లోలోపల బాధపడుతున్న బొత్స..
మొన్న ఈ మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఎస్.కోట నియోజకవర్గం నేతలు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిపై కొట్టినంత పనిచేశారు. ఏంటి నీ బాధ .. మాకు బాధలు లేవా అంటూ నిట్టూర్చారు. యూస్ లెస్ ఫెలో అంటూ సహనం కోల్పోయి మాట్లాడారు. ఉంటే ఉండు లేకుంటే పో అని అనేశారు. దీంతో నాయకులు నొచ్చుకున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒకటి బయటపడింది. మీకేనా బాధలు..మాకు లేవా? అని ప్రశ్నించడం ద్వారా ఏదో ఆయన ప్రస్టేషన్ తో బాధపడుతున్నారు. బయటకు వ్యక్తం చేయలేక లోలోపల మదనపడుతున్నారు.
నిట్టూర్పు మాటలతో ధర్మాన..
మరో సీనియర్ మంత్రి ధర్మాన ఇటీవల మరీ నిట్టూర్పు మాటలు అనేస్తున్నారు. ప్రజలపై అక్కసును వెళ్లగక్కుతున్నారు. వైసీపీకి ఎందుకు ఓటు వేయరని ప్రశ్నించడం ద్వారా చులకన అవుతున్నారు. మగవారు పోరంబోకులు అంటూ సంభోదించి నాలుక కరుచుకున్నారు. ఆసరా సమావేశం నుంచి వెళ్లిపోతున్న వారిని నియంత్రించే క్రమంలో మాటలు కాస్తా బ్యాలెన్స్ తప్పుతున్నారు. అటు జగన్ నిర్వహించే వర్క్ షాపులకు గైర్హాజరవుతున్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు సమావేశాలకు ముఖం చాటేశారు. ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం సైతం నిర్వహించడం లేదు. దీంతో ధర్మాన వ్యవహార శైలి పై సొంత పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.

పద్ధతి ప్రకారం డీగ్రేడ్..
అయితే ఉత్తరాంధ్రకు పెద్దతలకాయలుగా ఉన్న ఇద్దరు మంత్రుల అసహనానికి ప్రధాన కారణం సీఎం జగనే. ఆయన ఓ పద్ధతి ప్రకారం వారిని డీగ్రేడ్ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నాయకులు ఒక వెలుగువెలిగారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి పాచికలు పారడం లేదు. పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టలేని విధంగా జగన్ పట్టుబిగించారు. ఎమ్మెల్యేలతోనే తిరుగుబాటు చేయిస్తున్నారు. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు లేవని లీకులిప్పిస్తున్నారు. ఇవన్నీ వారికి చికాకు తెప్పిస్తున్నాయి. అసహనానికి కారణమవుతున్నాయి. ఎన్నికలు సమీపించే కొలదీ వీరి అసహనం మరింత తీవ్రమయ్యే చాన్స్ ఉన్నట్టు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.