Rayalaseema Farmers: రాయలసీమ రైతు మొండోడు. నేలతల్లిని నమ్మినోడు. మొండి ధైర్యంతోనే బతుకీడ్చుతున్నాడు. వాన కురవకపోయినా, పంటరాకపోయినా ధైర్యంతో, తెగువతో సాగు చేస్తున్నాడు. వరుస కరువులే ఆ ధైర్యాన్ని ఇచ్చి ఉండొచ్చు. కరువులతో నిత్యం సహజీవనం చేస్తున్నాడు కాబట్టే మొండిగా తయారై ఉండవచ్చు. పౌరుషానికి పుట్టినిల్లు అంటారు. కానీ ప్రశ్నించేతత్వం సీమలో సచ్చిపోయిందనవచ్చు. కులాల కుంపట్లతో, వర్గాల బానిసత్వంతో ప్రభుత్వాలను ప్రశ్నించడం మానేసాడు. ఫలితంగా తన మెడకు తానే ఉరేసుకుంటున్నాడు.

రాయలసీమలో రైతుల బాధలు వర్ణణాతీతం. పాపాలు పెరిగినట్టు అప్పులు పెరిగిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడికి రూపాయి లాభం లేక నష్టపోతున్నారు. అప్పుల భారం మోయలేని రైతులు ఉరితాడునే విముక్తిగా భావిస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన స్థితి. పాలకులు ఒకవైపు రైతు జపం చేస్తునే ఉంటారు.. మరోవైపు రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. కనీసం ఆత్మహత్యగా గుర్తించడానికి నిరాకరిస్తారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ మరణాలు అంటే ఎదురుదాడి చేస్తారు. ఉన్నన్ని రోజులు ప్రభుత్వం మీద ఈగ వాలకుండా చూసుకుంటే చాలు అన్నట్టు ప్రభుత్వాలు ప్రవర్తిస్తాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పూర్తీ అవుతోంది. కానీ రైతు కోసం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం లేదు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో కేవలం రూ. 13500 రైతుకు ఇస్తోంది. అందులో రూ. 6000 కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు ఇచ్చే సంక్షేమం రూ. 7500 మాత్రమే. గతంలో పంట నష్టపరిహారం, ఇన్ పుట్ సబ్సీడీ, వాతావరణ బీమా, రుణమాఫీ లాంటి పథకాలు రైతులను ఆదుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వంలో ఆ పథకాలు అటకెక్కాయి. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రాయలసీమలో నీటి వనరుల లోటు కారణంగా డ్రిప్ ఇరిగేషన్ ను రైతులు వినియోగిస్తారు. ఐదెకరాల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కు దాదారు రూ. లక్ష ఖర్చు అవుతుంది. ఇప్పటికే అప్పుల బాధతో ఉన్న సీమ రైతులకు ఇది మోయలేని భారం. దీంతో గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను సబ్సీడీతో ఇచ్చేవారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సీడీ ఇచ్చేవారు. మిగిలిన రైతులకు 90 శాతం సబ్సీడీతో ఇచ్చేవారు. ఫలితంగా రాయలసీమ రైతులు సాగుకు మొగ్గు చూపేవారు. రాయలసీమలో హార్టికల్చర్ పెరగడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం రైతు భరోసాతోనే సరిపెట్టుకుంటోంది. ఫలితంగా సీమ రైతు నానాటికి కునారిల్లుతున్నాడు. ఎన్నికల సమయంలోనైనా ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఎదురుచూస్తున్నాడు.