Pawan Kalyan Chandrababu- Jagan: జగనంటే జనం.. జనమంటే జగన్…గత ఎన్నికల ముందున్న నినాదం ఇది. జనహృదయ నేతగా జగన్ ను అభిమానులు, వైసీపీ శ్రేణులు పిలుచుకునేవారు. అంతలా ఉండేది జనంతో జగన్ కు అటాచ్ మెంట్. కానీ ఎన్నికల తరువాత సీన్ మారింది. జనాలతో ఇక నాకేంపని అనుకున్నారో? లేకుంటే వారి మెచ్చేలా పనిచేయడం లేదని నిలదీస్తారో అన్న భయమో? కానీ జనాన్ని దూరం పెట్టారు. పోలీసుల భద్రత నడుమ, బారికేడ్లు, పరదాల చాటున జనాన్ని చూసి మురిసిపోతున్నారు. ఆకాశమార్గంలో పర్యటనలతో తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమవుతున్నారు. చివరకు గుంటూరు, విజయవాడ నగరాలకు రావాలన్నా ఆకాశమార్గాన్నే ఎంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ లు జనం బాట పట్టేసరికి జగన్ తట్టుకోలేకపోతున్నారు. వారి పర్యటనలకు అంత జనం ఎందుకొస్తున్నారు? అని అంతర్మథనం చెందే క్రమంలో తన పాత జనం నినాదం, పాదయాత్రలు, సభలు, సమావేశాలు మరిచి …అదో పబ్లిసీటి స్టంట్ గా చూపేందుకు ఆరాటపడుతున్నారు.

గత కొద్ది నెలలుగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కందుకూరు ఘటన జరిగింది నాలుగు రోజుల కిందట. అయితే చంద్రబాబు సభలకు, రోడ్ షోలకు జనాలు వెల్లువలా వస్తోంది వాస్తవం. దాంతో వైసీపీ నేతలు కలవరపాటుకు గురికావడం అంతే వాస్తవం. అందుకే పబ్లిసిటీ స్టంట్ అని.. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెడితే జనాలు అంత బాగా కనిపిస్తారని ప్రచారం ప్రారంభించారు. కందకూరి ఘటనకు చంద్రబాబే బాధ్యుడు అని.. ఎనిమిది మందిని హత్య చేశాడని ఆరోపించడానికి కొందరు మంత్రులు వెనకాడలేదు. చివరకు తిరుపతి వెంకన్న సన్నిధిలోనే మంత్రి రోజా చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలన్నట్టు.. సీఎం జగన్ కూడా+- శవరాజకీయాల్నే కంటిన్యూ చేశారు. చంద్రబాబే ఆ ఎనిమిది మందిని ప్లాన్ ప్రకారం చంపేసినట్టు ఆరోపణలు చేశారు. శవ రాజకీయం వెనుక తానే ఉన్నట్టు ఒప్పుకున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైద్య కళాశాల శంకుస్థాపనకు జగన్ విచ్చేశారు. అక్కడ విద్యార్థులు, మహిళలను బాగా సమీకరించారు. వారిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. డ్రోన్ షాట్ల కోసం చంద్రబాబు ప్రయత్నించి ఎనిమిది ప్రాణాలను పొగొట్టారని అన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో సైతం డ్రోన్ల షాట్ల గురించే ప్రయత్నించి అంతమంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారని ఆరోపించారు. అసలు చంద్రబాబును చూడడానికి ప్రజలు ఎందుకొస్తారని..ఆయన ఏ మంచీ చేయలేదని చెప్పుకొచ్చారు. పబ్లిసిటీ కోసమే ఆయన ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెడుతున్నారని కూడా ప్రకటించారు. అయితే ఇప్పటివరకూవైసీపీ నేతలు ఇదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ అదే జాబితాలోకి వచ్చారు., చంద్రబాబు సభలకు జనాలు పెద్దగా రావడం లేదని.. అలాచూపిస్తున్నారని చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. వారు పదే పదే అదే చెబుతుండడం, ఇప్పుడు జగనే నేరుగా రంగంలోకి దిగడంతో ప్రజలు కూడా ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత అని ఆరా తీయడం ప్రారంభించారు. గతంలో ఇవే సందుల్లో జగన్ పాదయాత్ర, ఎన్నికల సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అప్పుడు హాజరైంది అశేష జనవాహని.. అయితే ఇప్పుడు హాజరైంది జనం కాదనడంపై నవ్వుకుంటున్నారు. అటు అంతర్గత సమావేశాల్లో వైసీపీ నేతలు చంద్రబాబు సభలకు వస్తున్న జనం గురించే చర్చించుకుంటున్నారు.

ఇక జనసేన పవన్ సభలు, సమావేశాలకు అభిమానులు, జనసైనికులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అసలు జనసేనలో జన సమీకరణ అన్న మాటే వినిపించదు. అటువంటి ప్రయత్నం నేతలు చేయరు. అయినా జనాలు తరలివస్తుంటారు. అయితే పవన్ కార్యక్రమాలకు వచ్చే జనాలను చూసి వైసీపీ నేతలకు కంటగింపు తప్పడం లేదు. మొన్నటి విశాఖ ఎయిర్ పోర్టు ఘటన ముమ్మాటికీ వైసీపీ నేతల కడుపు మంటే. జనవాణి కార్యక్రమానికి ముందురోజే వైసీపీ ఉత్తరాంధ్ర గర్జనకు పిలుపునిచ్చింది. లక్షలాది మంది జనాలను సేకరించే ప్రక్రియలో ఫెయిలైంది. ఆ సాయంత్రానికి పవన్ విశాఖ చేరుకునే క్రమంలో ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలికేందుకు భారీగా జనసేన శ్రేణులు తరలివచ్చాయి. అప్పటికే ఉత్తరాంధ్ర గర్జన ఫెయిలైందన్న బాధతో ఉన్న వైసీపీ మంత్రులకు విశాఖ ఎయిర్ పోర్టులో పవన్ వెంట చూసిన జనాలను చూసి పిచ్చెక్కిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అటు పవన్ కౌలురైతు భరోసా యాత్ర చేపట్టినా.. ఇప్పటం గ్రామస్థులను పరామర్శించినా వేలాది మందిగా వస్తున్న జనాన్ని చూసి వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. అటు చంద్రబాబు, ఇటు పవన్ ల కు పెరుగుతున్న ప్రజా మద్దతు పలుచన చేసే ప్రయత్నంలోనే వారుంటున్నారు.