Jagan- Opposition Leaders: ఏపీలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐడీ వైసీపీ సర్కారు జేబు సంస్థలా మారిపోయింది. గత మూడున్నరేళ్లుగా నిఘా సంస్థకు దండిగా పని దొరికింది. గతంలో ఎప్పుడో ఒకసారి అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు వారికి పని దొరికేది. కానీ జగన్ సీఎం పీఠం ఎక్కాక… ఏ చిన్న ఘటనకైనా సీఐడీని ప్రయోగించడం పరిపాటిగా మారింది. ఎవరైనా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా సీఐడీ,, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడినా సీఐడీ.. ఇలా అన్నింటిపైనా సీఐడీని ప్రయోగించి దండిగా పని కల్పిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులే టార్గెట్ గా సీఐడీ వ్యవహరించిన తీరు దారుణం. అచ్చెన్నాయుడు నుంచి అయ్యన్నపాత్రుడు వరకూ మాజీ మంత్రుల అరెస్ట్ లు, వారిపై వ్యవహరించిన తీరు మాత్రం అత్యంత హేయం. నేరపూరిత మిలిడెంట్ల అరెస్ట్ ల తరహాలో అలజడులు సృష్టించడం మాత్రం అమానుషం.

2020 జూన్ 21న టీడీపీ శాసనసభా పక్ష నేత అచ్చెన్నాయుడును ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అరెస్ట్ చేశారు. ఉదయం 7.30 గంటలకు వందలాది మంది పోలీసులతో చుట్టుముట్టి మరీ అరెస్ట్ చేశారు. మొలల చికిత్స జరిగిందని కుటుంబసభ్యులు చెప్పినా వినలేదు. టిఫిన్ చేసి.. మందులు వేసుకుంటాని చెప్పినా పట్టించుకోలేదు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ ఆస్పత్రుల వైద్య పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని అరెస్ట్ చేశారు. రోజంతా రోడ్డు మార్గంలో తిప్పారు. రక్త్రాస్రావం అవుతున్నా పట్టించుకోలేదు. రోజు గడిచిన తరువాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తరువాత రిమాండ్ కు తరలించారు.
మాజీ మంత్రి నారాయణ విషయంలో కూడా సేమ్ సీన్. పదో తరగతి ప్రశ్నాపత్రాల లికేజీ సాకుగా చూపి 2022 మేలో అరెస్ట్ చేశారు. కుమారుడి వర్ధంతి కార్యక్రమంలో ఉన్నానని చెప్పినా పట్టించుకోలేదు. కనీసం కనికరించలేదు. చేతిలో నోటీసు పెట్టి బయటకు తీసుకుపోయారు. కిడ్నాప్ తరహాలో పట్టుకుపోయారు. చివరకు కేసు వివరాలు వెల్లడించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
2020 మేలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా ఇదే తరహాలో అరెస్ట్ చేశారు. ఓ మర్డర్ కేసులో రవీంద్ర పాత్ర ఉందని కేసు నమోదుచేసి.. ఇంటి గోడదూకి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ లో నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
ఎమ్మెల్సీ బీటెక్ రవిని 2021 ఏప్రిల్ 3న చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. 2018లో పులివెందుల గొడవలకు కారకుడిగా చూపి…విమానాశ్రయంలో నోటీసులిచ్చి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఒక అంతర్జాతీయ నేరస్తుడ్ని అరెస్ట్ చేసేటంతగా హడావుడి చేశారు.
2021 జనవరి 20 న మాజీ మంత్రి కళా వెంటకరావును అరెస్ట్ చేశారు. రాజాంలోని ఆయన స్వగ్రామంలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు వేయించారని అభియోగం మోపుతూ అరెస్ట్ చేశారు. బీపీ, షుగర్ తో బాధపడుతున్నట్టు చెప్పినా వినలేదు.

కుల విధ్వేషాలను రెచ్చగొట్టారని అభియోగం మోపుతూ 2021 మే 14న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్నానని చెప్పినా వినలేదు. తెలంగాణ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకొని మంగళగిరి కేంద్ర కార్యాలయానికి తరలించారు. స్టేషన్ కు వెళ్లేటప్పుడు సక్రమంగానే ఉన్నా.. బయటకు వచ్చినప్పుడు మాత్రం రఘురాజు గాయాలతో కనిపించారు. తనకు సీఐడీ పోలీసులు రాంగ్ ట్రీట్ మెంట్ ఇచ్చారని స్వయంగా వైసీపీ ఎంపీ బయటకు చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డు చేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు, 70 ఏళ్ల నందకిశోర్ ను అదుపులోకి తీసుకున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినలేదు. కరోనా సమయంలో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. తరువాత విడిచిపెట్టారు. ఆయనకు జ్వరం రాగా పరీక్షించారు. కరోనాగా తేలింది. అక్కడకు రెండు రోజులకే ఆయన మరణించారు.
ఇలా సీఐడీ, పోలీసుల వేదింపుల జాబితా చెబితే చాంతాడంత ఉంది. టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొమ్మిరెడ్డి పట్టాభి, చింతమనేని ప్రభాకర్, దూళిపాళ్ల నరేంద్ర, పరుచూరి అశోక్ బాబు, కూన రవికుమార్, గల్లా జయదేవ్, బుద్దా వెంకన్న, నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి , బీసీ జనార్దనరెడ్డి, నాదేండ్ల బ్రహ్మం చౌదరి.. ఇలా దాదాపు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నాయకులను సీఐడీతో పాటు పోలీసులు టార్గెట్ చేసి అరెస్టులు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యర్థులను వేటాడేందుకు మాత్రమే సీఐడీ,. పోలీసులను జగన్ ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు మిగతా నాయకులపై కూడా ఫోకస్ పెంచుతున్నట్టు తెలుస్తోంది.