Bigg Boss 9th Week Voting Results: గత వారం సూర్య ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా లేకుండా బిగ్ బాస్ సూర్యను నేరుగా ఎలిమినేట్ చేశారు. సూర్య అఫైర్స్ పక్కనపెడితే మంచి ఆటగాడన్న పేరుంది. టాస్క్స్, గేమ్స్ లో గట్టిగా పోటీ పడతాడు. ఒకసారి కెప్టెన్, మరోసారి కంటెండర్ అయ్యాడు. ఇంత చేసినా ప్రేక్షకులు ఆయన్ని బయటకు నెట్టేశారు. అదే తరహాలో మరో టాప్ కంటెస్టెంట్ ఈ ఆదివారం హౌస్ వీడనున్నారట. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ముగ్గురు డేంజర్ జోన్లో ఉండగా అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఆమెనే అంటూ ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో శ్రీహాన్, రాజ్, వాసంతి మాత్రమే ఎలిమినేషన్స్ లో లేరు. మిగతా 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ కావడం జరిగింది. రేవంత్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడట. తర్వాత ఫైర్ బ్రాండ్ ఇనయా సెకండ్ ప్లేస్ సాధించారట. బాల ఆదిత్య, కీర్తి, రోహిత్ టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారట. ఇక ఆదిరెడ్డికి ఆరవ స్థానం, శ్రీసత్యకు ఏడవ స్థానం దక్కిందట. మిగిలిన ఫైమా, మెరీనా, గీతూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
కాబట్టి స్వల్ప ఓట్ల తేడాతో పోటీపడుతున్న ఫైమా, మెరీనా, గీతూలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ప్రస్తుత ఓటింగ్ ప్రకారం గీతూ ఇంటి నుండి జెండా పీకడం ఖాయం అంటున్నారు. బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరుగాంచిన గీతూ ఎలిమినేట్ అయితే నిజంగా షాకింగ్ పరిమాణం చోటు చేసుకున్నట్లే. ఈ సీజన్లో మంచి గేమర్ గా ఫస్ట్ ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ గీతూ అని చెప్పాలి. ఆమె గేమ్ పట్ల ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

అది గీతూలో ఓవర్ కాన్ఫిడెన్స్ కి దారి తీసింది. ఏకంగా బిగ్ బాస్ కాదు నేను ఆట ఆడిస్తా అంటూ అతి చేయడం మొదలుపెట్టింది. బిగ్ బాస్ రూల్స్ పక్కన పెట్టి సొంత రూల్స్ అమలు చేస్తూ కంటెస్టెంట్స్ కి చిరాకు తెప్పిస్తుంది. గత రెండు వారాలుగా గీతూ గేమ్ తీవ్ర విమర్శలపాలు అవుతుంది. సోషల్ మీడియాలో ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం గీతూ ఎలిమినేట్ కావచ్చని గట్టిగా వినిపిస్తోంది.