
సమాజంలో అంతరాలు తొలగిపోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా రావాలని కోరుకుంటున్నారన్నారు.
రెండేళ్లుగా జనరంజకమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతులకు పగటి పూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసమే రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పంటలకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
గత ప్రభుత్వం ఇవ్వకుండా చేసిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, చెల్లించకుండా వదిలేసిన రూ.9 వేల కోట్ల ఉచిత విద్యుత్ రూ324 కోట్ల విత్తన బకాయి భారాన్ని భరించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఎన్నో మార్పులు చేశామని పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని సూచించారు.
సచివాలయాల్లో పౌరసేవలతో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 2.7 లక్షల మంది వలంటీర్లతో పి:చన్లు పంపిణీ చేశామన్నారు. ఇంటికే పింఛన్ వచ్చేలా చేశామని చెప్పారు. దీంతో రాష్ర్టంలో ఎవరికి కూడా బాధలు లేకుండా చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో పరిపాలన ఇంకా కొత్త పుంతలు తొక్కుతుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ రాష్ర్ట అభివృద్ధిపై పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టనున్నట్లు సూచించారు.