
జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి సగం కాలం పూర్తయ్యింది. దీంతో.. వైసీపీ పాలన ఎలా ఉందనే విషయమై ఎవరి విశ్లేషణ వారు చేస్తున్నారు. ఇదే విధంగా వైసీపీ నేతలు కూడా పోస్టు మార్టం చేస్తున్నారు. అయితే.. వాళ్లు చెప్పేది ఏమంటే.. సంక్షేమం విషయంలో తమ సర్కారుకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అంటున్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు.. పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు దక్కాయని చెబుతున్నారు. ఈ విషయంలో ఇటు ప్రజల్లో కూడా మంచి అభిప్రాయమే ఉందని అంటున్నారు. అయితే.. ఒకే ఒక్క సమస్యతో ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత వచ్చిన ప్రతీ ఎన్నికల్లోనూ తమ పార్టీ సత్తా చాటిందని గుర్తు చేస్తున్నారు. పంచాయతీల్లో 80 శాతానికి పైగా.. మునిసిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు దక్కించుకున్నామని, తమ పాలనను ప్రజలు ఎంతగా మెచ్చుకుంటున్నారో ఈ ఫలితాలే నిదర్శమని చెబుతున్నారు. ఆ తర్వాత ఇరుపతి ఉప ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించామని, తమకు ప్రజా మద్దతు ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని అంటున్నారు.
అయితే.. న్యాయస్థానాల్లో ఎదురయ్యే ప్రతికూలతలే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయని అంటున్నారు. పలు విషయాల్లో ఏపీ సర్కారును హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు.. నిన్నటి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకం వరకూ ఎన్నో విషయాల్లో సర్కారుకు వ్యతిరేక తీర్పులే వచ్చాయి. ఇప్పుడు విద్యార్థుల పరీక్షల విషయంలోనూ జగన్ సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని సుప్రీం ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇలా.. న్యాయస్థానాల విషయంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తోందని, ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే.. తమకు ఇబ్బందే లేదని చెబుతున్నారు. దీన్ని సరిచూసుకుంటే.. ప్రజాక్షేత్రంలో ఎలాగో తమకు కావాల్సినంత బలం ఉంది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ తిరుగు ఉండదని అంటున్నారు. మరి, దీనిపై జగన్ ఏమంటారో..?