Jagan: తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి తర్వాత ఏ క్షణంలోనైనా ఎలక్షన్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ప్రధానంగా వైసిపి, టిడిపి, జనసేన కూటమి మధ్య పోటీ ఉంటుంది. అటు జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. టిడిపి, జనసేన కూటమి వైపు బిజెపి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ బిజెపి నుంచి స్పష్టత లేదు. బిజెపి నిర్ణయం ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ పావులు కదిపే అవకాశం ఉంది. అటు బిజెపి లేని కూటమిలోకి తాము సిద్ధమని వామపక్షాలు సంకేతాలు ఇస్తున్నాయి.
ఇప్పటివరకు తాము జనసేనతో మాత్రమే వెళతామని బిజెపి చెబుతోంది. అవసరమైతే ఒంటరి పోరుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని బిజెపి వ్యూహాలు రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూటమిలోకి రమ్మని పవన్.. టిడిపి లేకుండా మనమిద్దరమే కలిసి పోటీ చేస్తామని బిజెపి జనసేనకు ప్రతిపాదన పెడుతోంది. అయితే వైసీపీని ఓడించాలంటే బిజెపి, జనసేన బలం చాలదని.. విడివిడిగా పోటీ చేస్తే.. అది అంతిమంగా వైసిపి కె ప్రయోజనమని పవన్ భావిస్తున్నారు. పాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానని చెబుతున్నారు.
అయితే ఒకవేళ జనసేన, బిజెపి కలిసి పోటీ చేయాలనుకుంటే మాత్రం అద్భుత అవకాశం ఒకటి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 60 మందికి పైగా సిట్టింగులను మార్చడానికి జగన్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 11 మంది అభ్యర్థులను మార్చుతూ వైసిపి హై కమాండ్ నిర్ణయించడం ఒక సంచలనమే. ఇందులో ముగ్గురు మంత్రులు కూడా ఉండడం విశేషం. రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి మరి బీసీలకు జగన్ అవకాశం కల్పించనున్నారు. ఒక అధికారపక్షంగా జగనే ఈ నిర్ణయం తీసుకుంటే.. విపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం అదే ఫార్ములాను అనుసరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం 20 నుంచి 30 చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో దించుతుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ నుంచి సిట్టింగులు 60 మంది.. టిడిపి నుంచి 20 నుంచి 30 మంది పోటీకి దూరం కావడం ఖాయం. అటువంటి నాయకులను బిజెపి కానీ.. జనసేన కానీ తమ వైపు తిప్పుకుంటే ఎన్నికల్లో విశేష ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గంలో పట్టు ఉంటుంది. తమకంటూ ఓటు బ్యాంకు ఉంటుంది. పో ల్ మేనేజ్మెంట్ తెలుస్తోంది. అందుకే అటువంటి నాయకులను తీసుకుని టిక్కెట్లు కట్టబెడితే మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎన్నికలకు మూడు నెలల వ్యవధి ఉంది. తెలంగాణలో బిజెపి, జనసేన కలయిక ఆలస్యం అయింది. దాని ప్రభావం గెలుపోటములపై చూపించింది. ఏపీలో కానీ కొంచెం ముందస్తుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం బిజెపి, జనసేన చక్కని ఫలితాలు చవిచూసే అవకాశం ఉంది. కానీ ఈ అనూహ్య పరిణామాన్ని ఆ రెండు పార్టీలు సద్వినియోగం చేసుకుంటాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.