Congress And MIM: ప్రొటెం స్పీకర్‌తో పొత్తా… కాంగ్రెస్, ఎంఐఎం కలిసేది అప్పుడే..!

తెలంగాణలో బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు పొత్తుకోసం చూస్తోందా అన్న చర్చ జరుగుతోంది. అర్హులైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలనే ఎంఐఎంకు ప్రొటెం స్పీకర్‌ పదవి ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది.

Written By: Raj Shekar, Updated On : December 12, 2023 4:08 pm

Congress And MIM

Follow us on

Congress And MIM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తుల రాజకీయం తెరపైకి వస్తుంది. ఎన్నికల్లో బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌–సీపీఐ మాత్రమే కలిపి పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీఎస్పీ, సీపీఎం వేర్వేరుగా బరిలో నిలిచాయి. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్, 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ కూడా కొలువుదీరింది. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడమే.

దగ్గరయ్యేందుకే ప్రొటెం స్పీకర్‌?
తెలంగాణలో బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు పొత్తుకోసం చూస్తోందా అన్న చర్చ జరుగుతోంది. అర్హులైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలనే ఎంఐఎంకు ప్రొటెం స్పీకర్‌ పదవి ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. బీజేపీ అయితే నేరుగా ఆరోపణ చేస్తోంది. కాసీం రజ్వీ వారసుడు అయిన అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణం చేయమని బహిష్కరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ఎంఐఎంకు దగ్గరయ్యేందుకు లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు పొందేందుకు, తెలంగాణలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రొటెం స్పీకర్‌ పదవి ఇచ్చిందని పేర్కొంటున్నారు.

అధికారాలు ఉన్నా… నామమాత్రమే..
వాస్తవానికి ప్రొటెం స్పీకర్, స్పీకర్, వైస్‌ స్పీకర్‌.. ఎదైనా కానీ అధికారాలు సమానంగా ఉంటాయి. అయితే ప్రొటె స్పీకర్‌ కాలం పరిమితం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు లేదా కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యే వరకు మాత్రమే కుర్చీలో కూర్చునే పదవి. దీనికే ఎంఐఎం తలొగ్గుతుందా అంటే అవుననలేం. ఎందుకంటే.. బీఆర్‌ఎస్‌ పాలనతో మిత్రపక్షంగా ఉండి అనేక పనులు చేయించుకుంది. ఇప్పుడు ఈ పరిమిత పదవికి పాకులాడి కాంగ్రెస్‌తో దోస్తీ చేయడం అసంభవం. ఈ విషయం బీజేపీ నాయకులకు కూడా తెలుసు. కానీ, ముస్లిం ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీపై విమర్శలు
చేస్తోంది.

పొత్తు అప్పుడే..
కాంగ్రెస్‌–ఎంఐఎం దోస్తీ ఇప్పట్లో తేలే అవకాశం లేదు. లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌–బీజేపీ–ఎంఐఎం ఒక్కటే అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. ముస్లింల ఓట్లు చీలడం కోసం ఎంఐఎం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కానీ, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నాటికి పరస్పర సహకారం అవసరం కావొచ్చు. ఎందుకంటే ఎంఐఎం ఇప్పుడు తెలంగాణకే పరిమితమైన పార్టీ కాదు. బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ప్రభావం చూపింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. చాలా వరకు ఓట్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో రేపటి లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు అవసరమైతే కాంగ్రెస్‌–ఎంఐఎం మధ్య పొత్తు పొడిచే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఎవరి అవసరం వారిది మరి!