ఇప్పటి వరకైతే.. ఏపీలో వైసీపీ సర్కారుకు ఏదురే లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదలు.. మరే పార్టీ కూడా జగన్ను సరిగ్గా సవాల్ చేసే పరిస్థితిలో లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. నిన్నటి తిరుపతి ఉప ఎన్నిక దాకా వైసీపీ జోరు అప్రతిహతంగా సాగిపోతూనే వచ్చింది. తెలుగు దేశం పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైంది. ఒక అధికార పార్టీకి తనదైన రాజకీయ సేద్యం చేయడానికి ఇంతకు మించిన వాతారణం ఏముంటుందీ? అందుకే.. వైసీపీ ఆడింది ఆటగా మారింది. అయితే.. ఉన్నట్టుండి జగన్ కు కొత్త సవాల్ ఎదురైంది. అది కేసీఆర్ రూపంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చిపడింది.
ఓ వైపు నీటి పంచాయితీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో న్యాయాన్యాలు ఒక చర్చ కాగా.. పక్క రాష్ట్రాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం మరో ఎత్తు. ప్రజలు ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా? అన్న పద్ధతిలో ఇరు రాష్ట్రాలూ వ్యవహరిస్తున్నా.. దూకుడు మాత్రం తెలంగాణ వైపు నుంచే ఉంది. ఆ మధ్య ఈ అంశంపై మాట్లాడిన జగన్ తగ్గి ఉండే ప్రయత్నమే చేశారు. మేం పొరుగు రాష్ట్రం నుంచి స్నేహపూరిత వాతావరణమే కోరుకుంటున్నామని కూడా చెప్పారు. మరి, దీన్ని ఏపీ జనం ఎంత మేర పాజిటివ్ గా తీసుకుంటున్నారన్నది ప్రశ్న.
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు.. ఇదే జల యుద్ధం రెండు రాష్ట్రాల మధ్య జరిగినప్పుడు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు జగన్. కానీ.. ఇప్పుడు ఇదే సమస్య పునరావృతం అయినప్పుడు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబును ఓడించడంలో కేసీఆర్ సహకారం ఉందని అంటారు. అదే రాజకీయ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని, విపక్షాలు బలపడుతున్న వేళ ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది.
ఒకవేళ ఇది గేమ్ అయినప్పటికీ.. ప్రజలకు మాత్రం ఈ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్తే ఇబ్బందే కదా అన్నది వైసీపీలో సాగుతున్న చర్చ. తెలంగాణ పెడుతున్న ఇబ్బందులను చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తే.. ముఖ్యమంత్రిపై ప్రజల్లో పరపతి తగ్గిపోదా? అన్నది ప్రశ్న. ఇదిలాఉంటే.. పాలనలోనూ తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక సహజం. ఇలా చూసుకున్నప్పుడు సంక్షేమంలో రెండు రాష్ట్రాలూ పోటీ పడుతున్నప్పటికీ.. అభివృద్ధి విషయానికి వచ్చే సరికి తెలంగాణ ఒక అడుగు ముందున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీలో రిలయన్స్ పెట్టాల్సిన ప్రాజెక్టు రద్దైపోయింది. అదే సమయంలో తెలంగాణలో కిటెక్స్ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక, ఏపీలో పది వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేస్తే.. దానిపై నిరసనలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు ప్రకటించారు. ఇలా.. ఎటు చూసినా కేసీఆర్ నుంచి జగన్ కు తిప్పలు వచ్చిపడుతున్నాయనే అంటున్నారు. ఇది, ముదిరితే రాబోయే ఎన్నికల నాటికి ఇబ్బంది తప్పదని కూడా అంటున్నారు. మరి, దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడు అన్నదే కీలకం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Jagan facing problem with kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com