రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు దొరకడం లేదని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం చుట్టూ అదే సామాజిక వర్గానికి చెందిన కోటరీ ఉందని విమర్శలు చేశారు. మరి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు బయట ఇదే అభిప్రాయం ఉన్నా బయటపడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ దొరకటం ఎమ్మెల్యేలు, ఎంపీలకు గగనంగా ఉందనే వాదనలు ఉన్నాయి.
సొంత పార్టీ ప్రజాప్రతినిధుల విమర్శలకు విరుగుడుగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోజుకు పది మంది ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం అధికారులను అదేశించారు. ఒక పద్ధతి ప్రకారం అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అవకాశం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చాలా వరకూ చల్లార్చాలని భావిస్తున్నారు. వెంటనే ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేసిన సమయంలో ఎమ్మెల్యేలు ఎవరు అపాయింట్మెంట్ అడిగినా వెంటనే ఇచ్చేవారు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో సమస్యలు చెప్పిన వెంటనే తగిన చర్యలు తీసుకునేవారు. అందుకే ఆయన అంటే ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అభిమానం. అందుకే వైఎస్సార్ వారసుడిగా ఆ విధానాన్నే పాలో అవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంగా సుదీర్ఘ కాలం వేచి చూసిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ సమస్యలు విన్నవించుకోవడానికి అవకాశంగా ఆపార్టీ నేతలు చెబుతున్నారు.