Jagan- Chandrababu: ఏపీ రాజకీయాల్లో విశాఖది ప్రత్యేక స్థానం. అవశేష ఏపీలో ముఖ్య నగరంగా విశాఖ ఉంది. అందుకే విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినట్లు జగన్ చెబుతున్నారు. కానీ అది పెద్దగా విశాఖ నగర వాసుల అభిమానాన్ని చూరగొనలేదు. పైగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రజలు పెద్దగా ఆహ్వానించలేదని తేటతెల్లమైంది. అందుకే జగన్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విశాఖను అభివృద్ధి చేసి సాగర నగర వాసుల మనసు దోచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అటు చంద్రబాబు సైతం పోయిన చోటే వెతుక్కోవాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారు. ఎలాగైనా విశాఖలో పూర్వ వైభవాన్ని సాధించేలా పావులు కదుపుతున్నారు. అయితే ఆ ఇద్దరి నేతల వ్యూహాలతో విశాఖ నగరం రాజకీయ సమర వేదికగా మారనుంది. ఇప్పుడు ఎన్నికలకు పట్టుమని పది నెలల వ్యవధి కూడా లేకపోవడంతో.. ఆ ఇద్దరు నేతలు పోటాపోటీగా విశాఖ నగరంలో పర్యటిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే
ఒకరి తర్వాత ఒకరు సందర్శిస్తున్నారు. దీంతో పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది.
సీఎం జగన్ మంగళవారం విశాఖ నగరంలో పర్యటించరున్నారు. ఎక్కువ సమయం వెచ్చించి కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ తాజా టూర్ తో విశాఖ అభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తోందని చెప్పుకోవడానికి వైసిపి పావులు కదుపుతోంది. అయితే జగన్ ఇలా వెళ్లిన మరుసటి వారమే విశాఖలో చంద్రబాబు వాలిపోనున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. కీలక సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించనున్నారు.
వారం రోజుల వ్యవధిలోనే అధికార, పాలక పక్షాల అధినేతలు రానుండడంతో విశాఖ జిల్లాలో పొలిటికల్ హిట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సాగరనగరం రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు తప్పవని స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అటు తరువాత విశాఖ కేంద్రంగా వైసిపి తన కార్యకలాపాలను తగ్గించింది. అదే సమయంలో టిడిపి దూకుడు పెంచింది. ఇప్పుడు మరోసారి ఇరు పార్టీల అధినేతల రానుండడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.