Jagan Birthday: జగన్.. రెండు దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. 2004 వరకు సుపరిచితమే కాదు. కానీ దివంగత మహానేత రాజశేఖరరెడ్డి కుమారుడిగా సుపరిచితమయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునిఅవినీతి చేశారన్న ఆరోపణలతో వెలుగులోకి వచ్చారు. తండ్రి అకాల మరణంతో కష్టాలను ఎదుర్కొన్నారు. కేసులను చవిచూశారు. జైలు జీవితం అనుభవించారు. వాటన్నింటిని అధిగమించి రాజకీయాలను అవపోషణ పట్టుకున్నారు. అనతి కాలంలోనే అంతులేని విజయాన్ని అందుకున్నారు. చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షేమ పాలనతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినం.ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
1972 డిసెంబర్ 21న వైయస్ జగన్ జన్మించారు. కడప జిల్లా జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో ఆయన పుట్టారు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. తాత రాజారెడ్డి ముద్దుల మనవడిగా, తండ్రి రాజశేఖర్ రెడ్డి, తల్లి విజయలక్ష్మి గారాలపట్టిగా జగన్ పెరిగారు. రూపాయి డాక్టర్ గా ప్రాచుర్యం పొందిన రాజశేఖర్ రెడ్డి అనతి కాలంలోనే రాజకీయంగా ఎదిగారు. పులివెందులను పెట్టని కోటగా మలుచుకున్నారు. కడప జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశారు. తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అప్పుడే సుపరిచితమయ్యారు జగన్. 2004లో కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో సైతం రెండోసారి బరిలో దిగి గెలుపొందారు.
తండ్రి ఉండగానే జగన్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతాయి. తండ్రి అకాల మరణంతో ఆ కేసులన్నీ చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఎదురెళ్లి జైలు జీవితం కూడా అనుభవించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. అదే కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీశారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రెండోసారి పోటీ చేసి అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు మరోసారి ఏకపక్ష విజయానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఒకటి మాత్రం నిజం పదేళ్ల రాజకీయ పోరాటం. అలుపన్నది తెలియదు.. భయమన్నది లేదు. ప్రజల కోసం నడిచారు.. నిలిచారు.. ప్రజల మధ్య నుంచి ఎదిగారు. కేవలం రాజకీయ ప్రవేశం సులువుగా జరిగినా.. ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ముళ్ళ కిరీటమే. నిత్య సాహసమే. అధికార పీఠం వైపు వెళ్ళినా.. దానిని నిలుపుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. అయితే సాహస రాజకీయాలు ఒక్కోసారి వికటిస్తుంటాయి. ప్రస్తుతం ఏపీలో అటువంటి రాజకీయాలే నడుస్తున్నాయి. ఆ ప్రత్యర్థుల్లో జగన్ ఒకరు కావడం విశేషం. తన సాహస రాజకీయంతో అధికార పీఠాన్ని నిలుపుకుంటారో.. లేకుంటే చేజార్చుకుంటారో చూడాలి.