Sharad Power Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవర్ తెరపైకి వచ్చారు. కానీ ఇందుకు ఇతర పార్టీలు అంగీకరిస్తాయా? తాజా పరిణామాలు చూస్తే పవార్ అభ్యర్థి అవుతారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన్నే అభ్యర్థిగా నిలపాలని ఆప్ గట్టిగా భావిస్తోంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముంబైలో పవార్‌తో సమావేశమయ్యారు. అరగంట పాటు మంతనాలు జరిగాయి. ఆయన ఎన్‌డీఏ అభ్యర్థిపై పోటీచేయాలన్నది తమ అభిమతమని ఆప్ వర్గాలు తెలిపాయి. దీనిపై పవార్, ఎన్‌సీపీ ఇంతవరకు పెదవి విప్పలేదు.
అయితే ప్రతిపక్షాలు తమ అభ్యర్థిత్వంపై ఇంకా ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోకున్నా.. పవార్ మాత్రం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రపతి ఎన్నికపై పవార్ ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం కావలసి ఉంది. అయితే అనారోగ్యంతో ఆమె ఆస్పత్రిలో చేరడంతో కుదరలేదు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడానికి తాను సానుకూలమని ఆమె రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ద్వారా పవార్‌కు సందేశం పంపారు. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు కొన్ని ప్రతిపక్షాలు సుముఖంగా లేవు. కాంగ్రెసేతర అభ్యర్థికైతే ప్రతిపక్షాలన్నీ సహకరించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇందుకు సరేనన్నట్లు తెలిసింది. దీంతో ఆ దిశగా ఆయా పార్టీల నడుమ సమాలోచనలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Also Read: Opposition Meet- CM Jagan: జగన్ బీజేపీతోనే.. అందుకే పిలవడం లేదట
అందరి ఆమోదం కోసం..
అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి పేర్ల పరిశీలన ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. కాగా.. అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 15న ఢిల్లీలో జరిపే ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాకూడదని సీపీఎం నిర్ణయించింది. అంటే ఆ పార్టీకి చెందిన కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ రానట్లే. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా వచ్చే అవకాశాల్లేవు. కేజ్రీవాల్‌కు 15న పంజాబ్‌లో వేరే సమావేశం ఉంది. ఉద్ధవ్ కూడా ఆ సమయంలో అయోధ్యలో ఉంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రతిపక్షాలకు స్నేహహస్తం అందిస్తోంది. ఆయా పార్టీలతో చర్చించే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పార్టీ నాయకత్వం అప్పగించింది.
ఎన్నిక నిర్వహణపై..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ 2004లో మొదలైంది. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు మాత్రం బ్యాలెట్ విధానంలోనే జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని వివిధ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈవీఎంలలో ఉన్న టెక్నాలజీ లోక్‌సభ, అసెంబ్లీ వంటి ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రమే అనువుగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఓటర్లు ఈవీఎంపై అభ్యర్థి/గుర్తు ఉన్న చోట బటన్ నొక్కితే ఓట్లు నమోదవుతాయని.. అధిక ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు.రాష్ట్రపతి ఎన్నికల్లో నైష్పత్తిక విధానం అవలంబిస్తున్నారు. అంటే ప్రాధాన్య ఓటింగ్ ఉంటుంది. ఎలక్టొరల్ కాలేజీలోని ఓటర్లు.. బ్యాలెట్ పేపర్‌పై ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉండే కాలమ్ 2లో.. తమకు నచ్చినవారికి ప్రాధాన్య క్రమంలో 1, 2, 3, 4, 5 నంబర్లు వేయడం ద్వారా ఓటేస్తారని అధికారులు తెలిపారు. ఇలాంటి ఓటింగ్ విధానాన్ని నమోదుచేసే టెక్నాలజీ ప్రస్తుత ఈవీఎంలలో లేదని.. కొత్త ఈవీఎంలను రూపొందించుకోవలసి ఉందని చెప్పారు. కానీ ఈవీఎంలు వద్దు.. పాత పద్ధతి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని గత కొన్నిరోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:Perni Nani vs Balashowry: బాలశౌరి, పేర్నినానిపై వైసీపీ హైకమాండ్ సీరియస్..అసలు జరిగిందేమిటి?