
Jagan – Ponguleti : వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞ పనులు జరుగుతున్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సులు అనే ఒక వ్యవస్థ ఉండేది. దీనివల్ల కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే ముందస్తుగా ప్రభుత్వం చెల్లింపులు జరిపేది. అలా జలయజ్ఞం పనుల ద్వారా బాగుపడ్డ వారిలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకడు. ఈయన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులు చేయకున్నప్పటికీ ప్రభుత్వ నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడని వినికిడి. వాటి వల్లే ఆయన ఆర్థికంగా ఎవరూ అందుకోలేనంత స్థాయికి ఎదిగాడని చాలామంది అంటూ ఉంటారు. ఆ డబ్బు ద్వారానే రాజకీయాల్లోకి ప్రవేశించాడని, ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా నామ నాగేశ్వరరావు మీద గెలిచాడని చెబుతుంటారు. అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదట్లో జగన్ పార్టీలో ఉండేవాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కెసిఆర్ సమక్షంలోకి వెళ్లిపోయాడు. మొదట్లో కేసీఆర్ తో బాగానే ఉండేవాడు.. 2019లో టికెట్ రాకపోయేసరికి గ్యాప్ పెరిగింది.. ఆ గ్యాప్ కాస్తా వాటి నుంచి బయటికి వచ్చేంత వరకు విస్తరించింది.. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితికి సవాళ్లు విసిరే స్థాయికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. పార్టీ పేరు చెప్పకపోయినప్పటికీ, ఏ పార్టీలో చేరుతున్నారో వివరించకపోయినప్పటికీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారం సాగుతుండగానే కెసిఆర్ కు సవాళ్లు విసురుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ స్థాయిలో ఆర్థిక భరోసా ఎవరు ఇస్తున్నారని ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో ఒక కంపెనీ ఉంది.. ఈ కంపెనీ వివిధ కాంట్రాక్టు పనులు చేస్తున్నది. ప్రస్తుతం పొంగులేటి కంపెనీ సీతారామ ప్రాజెక్టు పనుల్లో కొంత భాగం చేస్తోంది. మరికొన్నిచోట్ల రోడ్ల నిర్మాణాలు చేపడుతోంది. అయితే తాజాగా పొంగులేటి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ ఏపీలో కూడా అడుగు పెట్టింది.
అక్కడి ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల పనిని ఈ సంస్థకు అప్పగించింది.. మైనింగ్ సివరేజీ వసూలు పనులను ఈ సంస్థ చేపడుతుంది. కాదు పొంగులేటి కుటుంబానికి చెందిన వారికి మరికొన్ని పనులు కూడా దక్కాయి. ఈ కంపెనీలకు అత్యధికంగా లాభాలు కళ్ళజూసే మైనింగ్ పనులు దక్కడం విశేషం. అయితే మొన్నటిదాకా సీవరేజీ వసూలను ఏ కంపెనీలకి కట్టబెట్టని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్, ఆయన బంధువులకు చెందిన కంపెనీలకు అప్పగించడంతో ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది.
భారత రాష్ట్ర సమితిలో చేరినప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలను కొనసాగించారు. ఒక దశలో జగన్ సూచన మేరకే పొంగులేటి భారత రాష్ట్ర సమితిలో చేరాలని రాజకీయ వర్గాలు అంటూ ఉంటాయి. పైగా ఇటీవల భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత పొంగులేటి వైయస్ విజయమ్మను కలిశారు. షర్మిల తో కూడా భేటీ అయ్యారు. ఆయన కంపెనీకి జగన్ మైనింగ్ పనులు కట్టబెట్టారు. వ్యవహారాలు మొత్తం చూసి “ఏపీలో సొమ్మును తెలంగాణ రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టేందుకు పొంగులేటి సమాయత్తమవుతున్నారు” అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. మొత్తానికి ఏపీలో పొంగులేటి కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ పనులు కట్టబెట్టడం ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. కాదు పొంగులేటి ద్వారా తెలంగాణ రాజకీయాలను జగన్ శాసిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది.