
Ponguleti Vs BRS : భారత రాష్ట్ర సమితి మంచి బయటికి వచ్చిన తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇంతవరకు ఏ పార్టీలో చేరుతున్నారో చెప్పకపోయినప్పటికీ.. ఖమ్మం జిల్లాలోని వైరా, అశ్వరావుపేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.. వైరాలో విజయాబాయిని, అశ్వరావుపేటలో జారే ఆదినారాయణ ను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక మిగతా చోట్ల అంటే పాలేరు, ఇల్లందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి భారత రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే 2018 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు మీద కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఇక అప్పటినుంచి కృష్ణారావును భారత రాష్ట్ర సమితి దూరం పెడుతోంది. దీంతో కృష్ణారావు సహజంగానే తన వ్యతిరేక స్వరాన్ని అధిష్టానం మీద వినిపిస్తున్నారు. అయితే ఈ ఏడాది నూతన సంవత్సరం నుంచే పొంగులేటి భారత రాష్ట్ర సంత నుంచి బయటికి రావడం, భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో కృష్ణా రావుకు కూడా బలం వచ్చినట్టుయింది. దీంతో కృష్ణారావు తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఇంతవరకు ఏ పార్టీలో చేరేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఆయన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల బీరం హర్షవర్ధన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్టు మాట్లాడారు. అయితే పొంగులేటి ఆహ్వానం మేరకు కృష్ణారావు కొత్తగూడెం వచ్చారు.
కొల్లాపూర్ నుంచి కృష్ణారావు తన అనుచరులతో సుమారు 50 వాహనాల్లో కొత్తగూడెం వచ్చారు. పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అధికార భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ముఖ్యమంత్రి చేస్తున్న చారిత్రాత్మకతప్పిదాలను ఆయన పొంగులేటి అభిమానులకు వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఓడించాలని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కొత్తగూడెం ప్రజలను కోరారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు జూపల్లి రావడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. వెలమ, రెడ్డి కాంబినేషన్లో మరో రాజకీయ పార్టీ ఏమైనా తెలంగాణలో పోసుకుంటుందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి.. దీనికి తోడు కొత్తగూడెం ఆత్మీయ సమయానికి భారీగా కార్యకర్తలు హాజరు కావడంతో పొంగులేటి లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. దీంతో ఆయన ఇదే వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఏదైనా జరగొచ్చు అనే సంకేతాలు రాజకీయ విశ్లేషకులు ఇస్తున్నారు.. అయితే భారత రాష్ట్ర సమితి తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో.. కమ్మ వెలమ కాంబినేషన్ రాజకీయాలకు కెసిఆర్ శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెలమ రెడ్డి కాంబినేషన్ రాజకీయాలకు నాంది పలకబోతున్నారు. ఇది తెలంగాణలో ఏ వైపు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.