Chandrababu Vs Jagan: జగన్ కి, బాబుకి అదే తేడా

వందల కొద్ది హామీలు ఇచ్చారు. పాదయాత్రలో కలిసిన వారందరికీ అభయం ఇచ్చారు. కానీ నవరత్నాలతో అన్ని లెక్క కట్టి చేతులు దులుపుకున్నారు.

Written By: Dharma, Updated On : January 6, 2024 4:04 pm

Chandrababu Vs Jagan

Follow us on

Chandrababu Vs Jagan: ఎవరు చెప్పినా వినని మొండితనం.. ఎంతటి రాజకీయ అనుభవం ఉన్నవారైనా సరే తన మాట వినాల్సిందేనన్న వైఖరి.. ఏపీ సీఎం జగన్ సొంతం. బహుశా ఈ మొండితనమే ఆయనకు ఈ స్థాయికి చేర్చింది. చిన్న వయసులోనే సీఎం పదవి కట్టబెట్టింది. అంతకుమించి ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. సంక్షేమంతో పప్పు బెల్లంలా నగదు పంచేస్తున్నారు. తన రాజకీయ ఉన్నతి కోసం రాష్ట్రాన్ని అంధకారంలో పెడుతున్నారు. ఆదాయ వనరులపై దృష్టి సారించకపోగా.. అప్పులు తెచ్చి మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వాటి మాటున అస్మదీయ కంపెనీలకు అడ్డగోలు కేటాయింపులు చేసి లూటీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఒకటా రెండా.. వందల కొద్ది హామీలు ఇచ్చారు. పాదయాత్రలో కలిసిన వారందరికీ అభయం ఇచ్చారు. కానీ నవరత్నాలతో అన్ని లెక్క కట్టి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక రైల్వే జోన్ లేదు, పోలవరం ఊసు లేదు, గ్రామాల్లో మౌలిక వసతులు కానరావడం లేదు. రోడ్లు బాగులేదు, వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. అప్పులు పెరుగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం పెరగడం లేదు. ఇలా ఎలా చూసుకున్నా వెనుకబాటుతనం వెంటాడుతూనే ఉంది.

తన రాజకీయ ఉన్నతి కోసం వందలాది మందిని ఇప్పుడు బలి పశువులుగా మార్చుతున్నారు. ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేయక.. ఇప్పుడు మీరు వెనుకబడి ఉన్నారంటూ నేతల తలరాతలనే మార్చేస్తున్నారు. ఐదు సంవత్సరాల పాటు ప్రత్యర్థులను తిట్టండి అంటూ సలహా ఇచ్చి.. ఇప్పుడు మాట మార్చుతున్నారు. మీది వ్యవహార శైలితో నియోజకవర్గాల్లో వెనుకబడ్డారని చెప్పి టికెట్లను తప్పిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల వైపు వెళ్లకుండా ముందస్తు వ్యూహంతో వారిని కట్టడి చేస్తున్నారు. అటు ప్రజలకు దగా.. ఇటు సొంతవారికి ఇలా నిర్వీర్యం చేస్తూ అనుకున్నది సాధించాలని ప్రయత్నిస్తున్నారు. దానికి ముచ్చటగా మొండితనం, ధైర్యం, తెగువ, దూకుడు అని తనకు తాను నిర్వచనాలు ఇచ్చుకుంటున్నారు.

అయితే రాజకీయంగా దూకుడు అన్నివేళలా పనిచేయదు. గత ఎన్నికల్లో అంతులేని విజయం, స్థానిక సంస్థల్లో ఏకపక్ష విజయం చూసి జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఒక్క అపజయం ఎదురైతే మాత్రం జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయం. చంద్రబాబు రాజకీయాలను రాజకీయాలుగా మాత్రమే చూస్తారు. దూకుడును ప్రదర్శించరు. విజయమైన, అపజయం అయినా ఒకే మాదిరిగా చూస్తారు. అయితే దేనికైనా చివరి వరకు సహనంతో పోరాడడం చంద్రబాబు నైజం. పార్టీతో పాటు తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించేందుకు ప్రయత్నించారే తప్ప వెనుకడుగు వేయలేదు. చంద్రబాబు టీం వర్క్ ను నమ్ముకుంటారు. జగన్ మాత్రం అంతా తానేనని.. తానే చేయగలనన్న భావనతో ఉంటారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు విఫల యత్నాలుగా మారినప్పుడు అందుకు బాధ్యత కూడా జగనే వహించాల్సి ఉంటుంది.