ప్రజలకు సేవ చేయడం అనే పదానికి రాజకీయ పార్టీలు ఎప్పుడో నీళ్లు వదిలేశాయనే అభిప్రాయం జనాల్లో బలపడిపోయింది. ఏ పని చేస్తే రాజకీయంగా లబ్ది పొందొచ్చు.. ఏ పని చేస్తే ప్రత్యర్థులను దెబ్బతీయొచ్చు.. అనే ఆలోచనలు తప్ప.. జనానికి అవసరమైన పని చేయడం అనేదే వాళ్ల డిక్షనరీ నుంచి తొలగించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కావాల్సినన్ని ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా రాజకీయ నేతలు ఎంచుకున్న మార్గాలను పరిశీలిస్తే.. మరింత స్పష్టంగా అర్థమైపోతుంది.
కరోనా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా? అని జనాలకన్నా రాజకీయ నాయకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. జనానికి సేవ చేసేందుకు కాదు.. చాలా కాలం సైలెంటుగా ఉంటే తమను ప్రజలు మరిచిపోతారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. సెకండ్ వేవ్ కాస్త చల్లబడగానే.. చంద్రబాబు నాయుడు వెంటనే రంగంలోకి దిగిపోయారు. కరోనా బాధితుల పేరుతో సాధన దీక్ష చేపట్టారు. ఇదే చంద్రబాబు.. కరోనా సెకండ్ వేవ్ కు నరేంద్ర మోడీ నిర్లక్ష్యమే కారణమని దేశం మొత్తం విమర్శలు గుప్పించినా.. పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. కానీ.. జగన్ పై మాత్రం ఒంటికాలిపై లేచిపోయారు. జగన్ తిట్టడం ద్వారా.. రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు.
ఇటు జగన్.. తాము కూడా ఏదో ఒకటి చేయకపోతే వెనకబడిపోతామని భావించారమే.. ‘దిశ’ చట్టాన్ని మళ్లీ గుర్తు తెచ్చారు. ఆ మధ్య తెలంగాణలో ‘దిశ’పై జరిగిన దారుణం నేపథ్యంలో ఉన్నఫలంగా చట్టం రూపొందించింది జగన్ సర్కారు. దీని ప్రకారం.. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తిచేసి, నాలుగు వారాల్లో దోషులకు శిక్ష పడాలి. ఆలోచన మంచిదే కావొచ్చు. కానీ.. ఆచరణ సాధ్యం అవుతుందా? అన్నది ప్రశ్న. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయడం అనేది అన్ని కేసుల్లోనూ అసాధ్యమనే చెప్పాలి. నిజంగా చిత్తశుద్ధితో మహిళలకు న్యాయం జరగాలని భావిస్తే.. ఇప్పుడున్న చట్టాలను పటిష్టంగా అమలు చేస్తూ.. పోలీసుల్లో జవాబుదారీ తనం పెంచి, ఏ మాత్రం నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం వచ్చే ఆస్కారం ఉంది. ఇదిలాఉంటే.. అటు ‘దిశ’ చట్టం అనేది ఇండియన్ పీనల్ కోడ్ కు సంబంధించిన అంశం. ఏపీ చేసిన ఈ చట్టం అమలు కావాలంటే.. పార్లమెంటులో ఆమోదం పొందాలి, రాష్ట్రపతి కూడా సంతకం చేయాలి. దీనికి అవకాశమే ఉన్నట్టు కనిపించట్లేదు. అయినా.. జనాల్లో చర్చ జరగాలనే ఉద్దేశంతోనే.. మళ్లీ దిశ ను తెరపైకి తెచ్చారనే ప్రచారం సాగుతోంది.
సొంత రాజకీయ లబ్ధి కోసం ఇంతగా ఆరాటపడుతున్న నేతలు.. తెలంగాణతో ఏర్పడిన జల వివాదం విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో మాత్రం సమాధానం లేదు. ఒకాయన మాజీ ముఖ్యమంత్రి, మరకొరు ప్రస్తుత ముఖ్యమంత్రి.. ఇద్దరూ ఆంధ్రప్రజల కోసమే పుట్టామన్నట్టుగా మాట్లాడుతారు. కానీ.. వారం రోజులుగా జల జగడం సాగుతున్నా.. ఎవ్వరూ నేరుగా స్పందించింది లేదు. ఈ విధంగా.. తమకు ఎక్కడ అవసరం పడుతుంది? ఏది మాట్లాడితే తమ పార్టీకి మేలు జరుగుతుంది అని మాత్రమే లెక్కలు వేసుకుంటున్న నేతలు.. ప్రజల విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.