Pawan Kalyan: పవన్ గాడిలో పడ్డారు. అవును ఇది నిజం. ఈ మాట స్వయంగా విశ్లేషకులే చెబుతున్నారు. పవన్ ఇలానే కొనసాగితే ప్రభంజనం ఖాయమంటున్నారు. ఆయన అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా మారరని.. ఆయనలో ఈ భావజాలాన్నే తాము కోరుకుంటున్నామని జన సైనికులు సైతం చెబుతున్నారు. వారాహి యాత్ర ప్రారంభించిన తరువాత పవన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారంతా పవన్ లో మార్పు కోరుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ మార్పు పవన్ లో కనిపిస్తుండడంతో ఫిదా అవుతున్నారు. ఓటరుగా మారేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ ను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూడడం ప్రారంభించారు.
వారాహి యాత్రలో పవన్ వాడుతున్న భాషపై వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలు వారికి చురకత్తుల్లా తగులుతున్నాయి. కత్తిపూడి సభ నుంచి వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీకి కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పవన్ విమర్శలు చేయకున్నా తమ పట్ల సానుకూలత తగ్గడంతో పునరాలోచనలో పడేస్తున్నాయి. జన సైనికులకు మాత్రం పవన్ కామెంట్స్ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. ఎక్కడలేని..మునుపెన్నడూ చూడని ధైర్యాన్నిస్తున్నాయి. మనోబలాన్నిచ్చి కళ్లెదుటే భవిష్యత్ ను చూపుతున్నాయి.
పవన్ తనకు ఒకసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు. జనసేనను మాత్రమే గెలిపించాలంటున్నారు. దీంతో పవన్ నుంచి ఈ తరహా మాటలు ఆశిస్తున్నవారు బహిరంగంగా, బాహటంగా మద్దతు తెలుపుతున్నారు. ఒకసారి చాన్సిద్దామా అన్న స్థిర నిర్ణయానికి వచ్చిన వారూ ఉన్నారు. చంద్రబాబు, జగన్ ల పాలన చూశాం. ఒకసారి పవన్ పాలన చూస్తామన్న వారూ ఉన్నారు. అదే సమయంలో పవన్ వ్యూహం, అంతరంగం తెలియక సతమతమవుతున్నవారూ ఉన్నారు. అయితే అటువంటి వారు కొద్దిరోజుల్లోనైనా పవన్ పై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది., ఒక్కటి మాత్రం చెప్పగలం. పార్టీకి, ఓటరుకు మధ్య నాయకులు వారధిగా ఉంటారు. కానీ పవన్ విషయంలో అలా కాదు. పవన్ నే ఓటరు పరిగణలోకి తీసుకుంటున్నాడు. తనకు తాను ఒక డెసిషన్ కు వస్తున్నాడు. పవన్ కు ఒక చాన్సిద్దామని భావిస్తున్నాడు. ఇది ప్రజల్లోకి బలంగా వెళితే ప్రభంజనం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.