TDP: తెలుగుదేశం పార్టీకి ఆప్త శత్రువులు అధికమవుతున్నారు. వారితోనే పార్టీకి, చంద్రబాబుకు అంతులేని నష్టం జరుగుతోంది. ఆ పదిమందితో పాటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి అపర మేధావి సలహాలు, సూచనలే నేటి పరిస్థితి కారణం. చంద్రబాబు కేసుల్లో ఇరుక్కున్నారు. బయటపడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కానీ జాతీయస్థాయిలో ఆయనకు తగినంత రీతిలో సహకారం లభించడం లేదు. దీనికి కూడా ముమ్మాటికి ఈ ఆప్త శత్రువులే కారణం.
ఏపీలో తెలుగుదేశం పార్టీ నిలదుక్కుకునేందుకు కారణం స్వచ్ఛంద సేవా నాయకులు. ప్రతి జిల్లాకు మూల స్తంభాలుగా నిలిచారు. తమ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశారు. వారి ఫలితంగానే పార్టీ నిలబడింది. వారి వ్యవహార శైలి తోనే పార్టీ ప్రతి గ్రామంలో సజీవంగా నిలవగలిగింది. ఆ స్థాయిలో ఇప్పుడున్న నేతలు ఎవరున్నారు. ఉన్నవారికి గుర్తింపు ఉందా? టిడిపి అధికారంలో ఉంటే ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేష్ లాంటి ఒకరిద్దరు నేతల మాటలకే చంద్రబాబు పెద్దపీట వేసేవారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు గెలిస్తే నా నా వల్లే అంటారు.. ఓడిపోతే నేను ఇచ్చిన సలహా పాటించలేదని చెబుతారు. కానీ వారిచ్చిన సలహాతోనే చంద్రబాబు తీవ్రంగా నష్టపోతూ వస్తున్నారు.
తాజాగా రాధాకృష్ణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టిడిపి సపోర్ట్ చేస్తే మేలు అని సూచించారు. అయితే అది టిడిపికి మేలో.. తన ఆంధ్రజ్యోతికి మేలో అన్నది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. అటు తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ రాధాకృష్ణ మాత్రం కాంగ్రెస్ తో కలవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఉన్న పొజిషన్లో అంత శ్రేయస్కరమైన నిర్ణయమా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఇటువంటి చెత్త సలహాలతోనే చంద్రబాబుకు ఈ పరిస్థితి తెప్పించారని నిజమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి బీఆర్ఎస్ అంటే పడదు. వైసీపీతో రాజకీయ వైరం. పోనీ బిజెపితోనైనా మంచి సంబంధాలు ఉన్నాయంటే అదీ లేదు. ఆ పరిస్థితికి ముమ్మాటికి ఆ పది మందితో పాటు ఏబీఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్లే కారణం. వీరి వ్యక్తిగత అభిప్రాయాన్ని చంద్రబాబుపై బలంగా రుద్దడంలో ముందుంటారు. గత ఎన్నికలకు ముందు బిజెపితో ఎడబాటు రావడానికి కారణం కూడా వీరే. ఇప్పుడు కాంగ్రెస్తో కలవాలని చెబుతున్నారు. అదే చంద్రబాబు గత ఎన్నికల తర్వాత ఓటమి ఎదురైతే ఒక్క మాట కూడా చెప్పకుండా యూపీఏ నుంచి బయటకు వచ్చారు. బిజెపి స్నేహం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇండియా కూటమిలో తన స్నేహితులను కలవలేకపోతున్నారు. ఈ పరిస్థితికి ముమ్మాటికి కారణం మాత్రం టీడీపీలో ఉన్న కొద్దిమంది, ఎల్లో మీడియా. పార్టీ బలోపేతానికి, అన్ని పార్టీలతో సఖ్యతకు వీరు పాటుపడడం లేదు. వీరి వ్యక్తిగత అజెండాతోనే ముందుకు సాగుతూ.. పార్టీకి నష్టం చేస్తూ.. చంద్రబాబు ఈ పరిస్థితికి కారణమవుతున్నారు. ఇకనైనా మేల్కొనకుంటే మరింత ముప్పు తప్పదు.