హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం కుట్ర ఇది..!

ప్రాంతీయ పార్టీలు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని చాలా చులకనగా చూస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టిటిడి భూముల విక్రయాలు అంశంపై, హిందూ దేవాలయాల పరిరక్షణపై మీడియా తో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హిందూ దేవాలయాలను కూల్చివేస్తే, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 8:20 pm
Follow us on


ప్రాంతీయ పార్టీలు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని చాలా చులకనగా చూస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టిటిడి భూముల విక్రయాలు అంశంపై, హిందూ దేవాలయాల పరిరక్షణపై మీడియా తో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హిందూ దేవాలయాలను కూల్చివేస్తే, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఏకంగా హిందూ మతాన్నే రాష్ట్రంలో లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ భూములకు రక్షణ అవసరం అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గత తొమ్మిది నెలలుగా పలుమార్లు ముఖ్యమంత్రికి లేఖ ద్వారా, పత్రికా ముఖంగా ప్రస్తావించింది. అన్నవరం, సింహాచలం దేవస్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చిన్న చిన్న దేవాలయాల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని, వైకాపా నాయకులు దేవాలయ భూములను కబ్జా చేయాలనే కుట్రలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అడ్డుకుంటోందని స్పష్టం చేశారు.

వైకాపా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టిటిడి పాలకమండలి ఏకంగా స్వామి వారికి చెందిన తమిళనాడులోని 23 ఆస్తులను విక్రయించేందుకు వేలం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని, దశాబ్దాలుగా వివాదంలో ఉన్న సింహాచలం ఆలయ భూములను పరిరక్షించకుండా కరోనాను అడ్డం పెట్టుకుని వాటిని కూడా ఆక్రమించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. నూతనంగా వైకాపా ప్రభుత్వం దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లను జీవో నెంబరు 39 ప్రకారం నియమించడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ భూములను, ఆస్తులను గుట్టు చప్పుడు కాకుండా దోచేందుకే జాయింట్ కలెక్టర్లను ప్రత్యేకంగా కేటాయించారేమో అని అనుమానాలు, భయాందోళనలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విధంగా నూతన జాయింట్ కలెక్టర్లను దేవాదాయ శాఖకు కేటాయించడం వెనుక అధికార పార్టీ ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ భూములకు పరిరక్షించేందుకు, దేవాదాయాల సంరక్షణ కోసం, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనగా ఈనెల 26 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ నిరసన ఉపవాస దీక్ష కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెంకన్న భక్తులు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.