టిటిడి భూముల విక్రయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మంగళవారం చేపట్టే నిరసన కార్యక్రమాల్లో జనసేన శ్రేణులు పాల్గొని, పార్టీ తరపున మద్దతు తెలుపుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బి.జె.పి. జనసేన కలసి చేసే ఈ నిరసన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారనీ, ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. స్థానిక బీజేపీ నాయకులను సమన్వయం చేసుకొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టి.టి.డి. భూములను వేలం ద్వారా విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని, టి.టి.డి. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పార్లమెంటరీ సంయుక్త కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది వరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన కూడదని నిర్ణయం తీసుకున్నమని, అయితే ప్రభుత్వం పాలనలోకి వచ్చిన కొద్ది కాలం నుంచే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ప్రణాళిక లేని పాలన మొదలుపెట్టిందన్నారు. సమస్యలు ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో జనసేన పార్టీ తగు రీతిలో స్పందించిందని చెప్పారు. రాజకీయ పోరాటాలతో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
బీజేపీతో పొత్తు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలన్నీ కలసి చేద్దామని భావించామని, విద్యుత్ ఛార్జీలపై గత వారం నల్లజెండాలతో ఎవరి ఇళ్లలో వారు నిరసన కార్యక్రమం నిర్వహించారన్నారు. ముందు ముందు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీజేపీతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద ఓ రోడ్ మ్యాప్ రూపొందిస్తామని తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ కోవిడ్-19 దృష్ట్యా సామాజిక దూరం ఖచ్చితంగా పాటించమని, నిరసనల్లో పది మందీ కలిసి కూర్చోవడం కాకుండా దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మన వల్ల మన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదని తెలిపారు.
లాక్ డౌన్ సడలించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు, కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సి.ఐ.డి. విభాగాన్ని వాడుకుని పనిగట్టుకుని మరీ జిల్లాల్లో జనసైనికుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందన్నారు. మన అధికార ప్రతినిధుల్ని సైతం ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెప్పారు.