YCP Vs Janasena: “పవనన్నకు జై కొడదాం.. జగనన్నకు ఓటేద్దాం” ఇటువంటి బ్యాచ్ తో జనసేన ఎంతలా దెబ్బతిందో అధినేత పవన్ కు తెలియంది కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. చాలామంది తాము జనసేన కార్యకర్తలమని చెప్పుకుంటారు. కానీ ఓటు వేసే విషయానికి వచ్చేసరికి మాత్రం కచ్చితత్వం పాటించరు. రకరకాల కారణాలు చూపి ప్రత్యర్థి పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు సభలకు హాజరైన జనాన్ని చూసి మురిసిపోయానని.. కానీ అలా వచ్చిన వారు ఓటర్లుగా మారలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సభలకు హాజరవుతున్న వారికి జనసేన విధివిధానాలను తెలుసుకోవాలని.. ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని పవన్ తరచూ చెబుతుంటారు. ఈసారి అటువంటి తప్పిదం జరగకుండా చూడాలని జనసేన నాయకత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
జనసేనలో ప్రో వైసిపి బ్యాచ్ ఎక్కువగా ఉంది. దీంతో జనసేన ముసుగులో ఉండే వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తుంటారు. పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఇటువంటివి ఎక్కువ కావడంతో జనసేన హై కమాండ్ అలెర్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించింది. జనసేన అధినేత పవన్ నిర్ణయాలకు అడ్డు చెప్పేవారు జనసేన కార్యకర్తలు కాదని నాగబాబు తేల్చేశారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేసి అటువంటి వారికి వార్నింగ్ ఇచ్చారు.
పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జనసేన శ్రేణులు మాత్రం పొత్తుపై భిన్నంగానే ఉండేవి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్న అధినేత నిర్ణయాన్ని గౌరవించాయి. అయితే జనసేనలో ప్రోవైసిపీ భావాలు ఉన్న నాయకులు సోషల్ మీడియా వేదికగా అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. పవన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే ఇప్పటికే అధినేత ఒక నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పుడు పొత్తులపై తప్పుగా మాట్లాడితే.. పార్టీలో అయోమయం తలెత్తే అవకాశం ఉందని నాయకత్వం భావించింది. అందుకే అటువంటి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్టీలో ఉంటూ.. పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించింది. అప్పటినుంచి జనసేనలో ఒక రకమైన క్రమశిక్షణ వాతావరణం కనిపిస్తోంది.