Homeక్రీడలుMohammed Siraj: గ్రేస్ బాల్ తో ఆడినవాడు.. నేడు నెంబర్ వన్ బౌలర్ అయ్యాడు..

Mohammed Siraj: గ్రేస్ బాల్ తో ఆడినవాడు.. నేడు నెంబర్ వన్ బౌలర్ అయ్యాడు..

Mohammed Siraj: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. వేదిక శ్రీలంక.. ప్రత్యర్థి జట్టు కూడా శ్రీలంకనే. గత ఏడాది ఆసియా కప్ ను శ్రీలంక గెలుచుకుంది. ఆడుతున్నది సొంతమైన కావడంతో శ్రీలంక అద్భుతం చేస్తుందని అందరూ అనుకున్నారు. ఆ ఫైనల్ మ్యాచ్లో అందరూ అనుకున్నది ఒకటైతే.. తన బౌలింగ్ తో అందరి నోళ్లు మూయించిన ఘనత ఒక్కడిది. అతడి పేరే మహమ్మద్ సిరాజ్. ఆసియా కప్ చరిత్రలోనే ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన అరుదైన ఘనత అతడు సాధించాడు. భారత్ ఆసియా కప్ దక్కించుకునేలాగా చేశాడు. శ్రీలంక జట్టును 50 పరుగులకే ఆల్ అవుట్ చేయడం వెనుక కీలక పాత్ర పోషించాడు. మహమ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఇప్పుడు నెంబర్ వన్ బౌలర్. అయితే అతడు ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.

వాస్తవానికి అందరూ అనుకున్నట్టు సిరాజ్ బౌలర్ కాదు. మొదట అతడు బ్యాటర్. పదో తరగతికి వచ్చిన తర్వాత ఇతర సూచనతో బౌలర్ గా మారాడు. క్రికెట్ పై ఇష్టం తో ఆపై చదువులు చదవలేదు. అతడి ఇంటికి దగ్గరలో ఉండే మైదానంలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ మ్యాచ్లు ఆడేవాడు. అయితే అతడు పై చదువులు చదవకపోవడం వల్ల తల్లి బెంగపెట్టుకుంది. సోదరుడు ఇంజనీరింగ్ చదువుతుంటే, నువ్వు ఆటలతో కాలక్షేపం చేస్తున్నామని వాపోయేది. ఒకరోజు ఈ విషయాన్ని తన సోదరుడికి ఆమె చెప్పింది.. దీంతో అతడు తన క్రికెట్ క్లబ్ లో సిరాజ్ ను చేర్పించాడు. ఒక మ్యాచ్ లో అతడు తొమ్మిది వికెట్లు తీశాడు. దీంతో అతనికి సంబంధించిన భవిష్యత్తును చూసుకుంటానని మాట ఇవ్వడంతో సిరాజ్ తల్లి మనసు కొంచెం కుదుటపడింది. మామయ్య క్లబ్లో ఆడిన మ్యాచ్ లో ఆడినందుకుగాను సిరాజ్ కు 500 ఇచ్చారు. అంతేకాదు సిరాజు తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి గ్రేస్ బాల్ తో క్రికెట్ ఆడాడు. 5 వికెట్లు తీశాడు. షూ వేసుకొని ఆడటం కూడా అతడికి అదే తొలిసారి. బంతి కూడా స్వింగ్ చేయడం అతనికి తెలియదు. ఇక అక్కడి నుంచి కొంతకాలం వరకు లీగ్ మ్యాచ్లు ఆడేవాడు. ఆ మ్యాచ్ లు ముగిసిన తర్వాత ఎటువంటి ముందడుగు లేకపోవడంతో రెండు నెలలు వేరే ఉద్యోగం చేశాడు. అది కూడా నచ్చక మళ్ళీ క్రికెట్లోకి వచ్చాడు. అండర్_23 కి ఎంపికయ్యాడు.

2016 సీజన్లో బెంగళూరు_హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే నెట్ బౌలర్ గా వెళ్ళాడు. అప్పటికి రెండు మ్యాచ్లు ఆడాడు. అక్కడ బెంగళూరు బౌలింగ్ కోచ్ గా ఉన్న భరత్ అరుణ్ సిరాజ్ బౌలింగ్ చూసి ముచ్చటపడ్డాడు. బౌలింగ్ బాగుందని వీవీఎస్ లక్ష్మణ్ కు చెప్పి.. ఆ ఏడాది హైదరాబాద్ రంజి జట్టుకు కోచ్ గా భరత్ అరుణ్ వచ్చారు. పట్టుబట్టి సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఆ సీజన్లో సిరాజ్ 45 వికెట్లు తీశాడు. ఇక 2017 ఐపిఎల్ సీజన్ వేలంలో సిరాజ్ పేరు చెప్పగానే ఎవరూ పది సెకండ్ల పాటు చేయి కూడా ఎత్తలేదు. కానీ తర్వాత హైదరాబాద్ జట్టు 2.6 కోట్లకు ఈ ఎంపిక చేయడంతో సిరాజ్ ఆనందానికి అవధులు లేవు. అప్పటిదాకా అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు.. నెల రోజుల్లో సొంత ఇంట్లోకి మారిపోయారు. ఆ సీజన్లో 6 మ్యాచ్ల తర్వాత సిరాజ్ కు ఆడే అవకాశం వచ్చింది. అంతమంది మధ్య ఆడటం వల్ల సిరాజ్ కొంత ఒత్తిడికి గురయ్యాడు. నాలుగు బంతులు వేసిన తర్వాత వికెట్ తీశాడు. అదే ఏడాది టీ20 లో భారత జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

2018లో బెంగళూరు జట్టు సిరాజ్ ను కొనుగోలు చేసింది . అయితే బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి సిరాజ్ చాలా నేర్చుకున్నాడు. ఆ సీజన్ లో సిరాజ్ అంతంత మాత్రంగానే ప్రతిభ చూపించాడు. 2019 కూడా అతనికి పెద్దగా కలిసి రాలేదు. వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు భారీగా ఇస్తుండడంతో ఎవరూ అతడి వైపు చూడలేదు. ఫలితంగా చాలామంది అతడిని ట్రోల్ చేశారు. “వెళ్లి ఆటో నడుపుకో” అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో సిరాజ్ మరింత కసిగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫలితం 2020 ఐపీఎల్ లో కనిపించింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ సిరాజ్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. ఆ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాతో 2020_21 లో జరిగిన టెస్ట్ సిరీస్ విజయం సిరాజ్ కు గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత సిరాజ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో అతడు ఏ స్థాయిలో విజృంభించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి విషయంలో అతనికి తోడు ఉన్న తండ్రి.. సిరాజ్ విజయాలు చూడకుండానే కన్నుమూశాడు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు సిరాజ్ తండ్రి కన్నుమూశాడు. అయితే దేశం కోసం, దేశం పేరు కోసం పని చేయాలని తండ్రి చెప్పిన మాటలు అతడిని మధ్యలో రానివ్వకుండా చేశాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే సిరాజ్..ఆసియా కప్ ఫైనల్లో తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ద్వారా వచ్చిన నగదును శ్రీలంక క్రికెట్ స్టేడియం సిబ్బందికి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. ఇప్పటికీ ఇండియాకు వచ్చినప్పుడు టోలిచౌకిలో తాను ఆడిన ఫస్ట్ లాన్సర్ బస్తి గ్రౌండ్ కి వెళ్తాడు. అక్కడ స్నేహితులతో చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాడు. దేశం కోసం మరింత గొప్పగా ఆడాలనేది, వరల్డ్ కప్ తీసుకురావాలి అనేది సిరాజ్ కల! ప్రస్తుతం ఆ దిశగానే అతడు అడుగులు వేస్తున్నాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular