Thota Chandrasekhar: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్ లు ఊపందుకుంటున్నాయి. నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వివిధ పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమి చవిచూడడం.. జాతీయ పార్టీ విస్తరణ అంశం పక్కకు వెళ్లడం.. బిఆర్ఎస్ తెలంగాణకే పరిమితం కావడం వంటివి చంద్రశేఖర్ పార్టీ మారేందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. దీంతో తోట చంద్రశేఖర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఓటమితో భారత రాష్ట్ర సమితి విస్తరణ మరుగున పడిపోయింది. కెసిఆర్ పిలుపుమేరకు తోట చంద్రశేఖర్ జనసేనను వీడి బిఆర్ఎస్ లో చేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకచోట పోటీ చేయాలని భావించారు. కానీ తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి ఎదురు కావడంతో ఏపీలో ఆ పార్టీ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి చంద్రశేఖర్ కు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి చంద్రశేఖర్ పనిచేశారు. పవన్ జనసేన ఏర్పాటు నుంచి సైతం వెన్నంటి నడిచారు. కానీ కెసిఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు.
అయితే తాజాగా ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. తోట చంద్రశేఖర్ జనసేన లో చేరతారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కానీ అధికారికంగా ఆ విషయాలు బయటకు రావడం లేదు. కానీ ఆయన చిరంజీవితో పాటు పవన్ ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడంతో మర్యాదపూర్వకంగా కలిశానని చంద్రశేఖర్ చెబుతున్నారు. కానీ ఆయన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తో కలిసి ఈనెల నాలుగున జనసేనలో చేరతారని బలంగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని బాలశౌరికి పవన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తోట చంద్రశేఖర్ ప్రజారాజ్యం పార్టీలో సైతం పోటీ చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున సైతం బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన జనసేనలో చేరితే గుంటూరు వెస్ట్ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మద్దాలి గిరి గెలుపొందారు. ఎన్నికల అనంతరం వైసీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టిడిపి,జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తానని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారు. అయితే పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. అన్ని కుదిరితే బాలశౌరితో పాటు చంద్రశేఖర్ సైతం జనసేనలో చేరడం ఖాయంగా తేలుతోంది.