Revenue Employees: రెవెన్యూ ఉద్యోగులకు అది హెచ్చరికే!

భూమి అనేది మనిషికి ప్రధానమైన జీవన హక్కు. వంశపారంపర్యంగా వస్తున్న భూమి, పూర్వీకుల నుంచి దఖలు పడిన భూమి, కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని ఇంకొకరు బలంగా లాక్కుంటే విలవిలలాడిపోతాం.

Written By: Dharma, Updated On : February 6, 2024 10:23 am

Revenue Employees

Follow us on

Revenue Employees: విశాఖలో తహసిల్దార్ దారుణ హత్యతో రెవెన్యూ శాఖ ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల రెవెన్యూ శాఖ పై దాడులు పెరుగుతుండడం పై అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కచ్చితంగా ఈ దాడుల వెనుక భూ వివాదాలు, మాఫియా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదాలు నడిచే ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులకు రక్షణ పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ పరిస్థితికి కారణం ఎవరు? అంటే మాత్రం ముమ్మాటికీ ప్రభుత్వ విధానాలు, రెవెన్యూ శాఖలో అవినీతి జాడ్యమే అన్నది బహిరంగ రహస్యం. అధికారుల హత్య వాంఛనీయం కాదు కానీ.. ఈ పరిస్థితికి మాత్రం ముమ్మాటికీ రెవెన్యూ వైఫల్యమే కారణం.

భూమి అనేది మనిషికి ప్రధానమైన జీవన హక్కు. వంశపారంపర్యంగా వస్తున్న భూమి, పూర్వీకుల నుంచి దఖలు పడిన భూమి, కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని ఇంకొకరు బలంగా లాక్కుంటే విలవిలలాడిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. అడ్డుకునే బలమైన ప్రయత్నం చేస్తాం. అధికారులను ఆశ్రయిస్తాం. కాళ్లా వేళ్లా పడతాం. ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అయితే అధికారులు బాధ్యత వర్గాల తరపు కాకుండా.. ఆక్రమించి, తప్పుడు మార్గాల్లో వెళుతున్న వారికి అండగా నిలిస్తే బాధితుడు కఠిన నిర్ణయానికి వస్తాడు. తన ఆశలు, భవిష్యత్ ను ఆ భూమిలో చూసుకునే బాధితుడు తిరగబడతాడు. ఆ క్రమంలోనే దాడులు, హత్యలకు తెగబడతాడు. ఆ కోవలోనే జరిగింది విశాఖ ఘటన అని పోలీసులు అనుమానిస్తున్నారు.

అందరూ అధికారులు తప్పుడుగా వెళ్తారని అనుకోలేము. కానీ అవినీతిలో సింహభాగం రెవెన్యూ శాఖ దేనిని ఒక అపవాదు ఉంది. ఒక ధ్రువపత్రాన్ని పరిశీలించిన తర్వాత అది తప్పు.. ఒప్పు అని నిర్ధారించగల ఒకే ఒక్క శాఖ రెవెన్యూ. కానీ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్న వారిని నియంత్రించలేకపోతున్నారు. ఆ తప్పుడు పత్రాలతో సమిధలవుతున్న బాధితులను అండగా నిలవలేక పోతున్నారు. వారికి న్యాయం చేయకపోగా.. అక్రమార్కులకు చాలామంది అధికారులు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే వివాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసేటంతగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాధితునికి, బలవంతుడికి మధ్య నిలబడుతున్న రెవెన్యూ శాఖ అధికారులు మూల్యం చెల్లించుకుంటున్నారు. బాధితుడు బలమైన నిర్ణయానికి వచ్చినా.. అక్రమార్కుడు బరితెగించినా నష్టపోతున్నది మాత్రం ముమ్మాటికీ రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందే.అందుకే ఇటువంటి విషయాల్లో రెవెన్యూ శాఖ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంది. విశాఖ ఘటన ఒక హెచ్చరికలా ఉంది.