IT Raids: బీఆర్‌ఎస్‌పై మళ్లీ ఐటీ దాడులు.. బెంబేలెత్తిస్తున్న బీజేపీ!

మొన్నటి వరకు హైదరాబాద్‌లోని నాయకులు, వారి ఆఫీసులు, బంధువుల ఇళ్లకే పరిమితమైన దాడులు తాజాగా జిల్లాలకు చేరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 16, 2023 12:37 pm
Follow us on

IT Raids: తెలంగాణలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పది రోజుల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగగా, మూడు రోజుల క్రితం ఆర్‌ఎస్‌ టార్గెట్‌గా దాడులు మొదలయ్యాయి. అవి కొనసాగుతున్నాయి. ఈనెల 13న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లపై దాడులు చేసిన ఐటీ అధికారులు తాజాగా గురువారం పలువురు బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

మిర్యాలగూడలో…
మొన్నటి వరకు హైదరాబాద్‌లోని నాయకులు, వారి ఆఫీసులు, బంధువుల ఇళ్లకే పరిమితమైన దాడులు తాజాగా జిల్లాలకు చేరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్‌ రావు కుమారులు, అనుచరుల ఇంట్లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి.

40 బృందాలతో తనిఖీలు..
ఐటీ అధికారులు 40 బృందాలుగా ఏర్పడి భాస్కరరావు ఇళ్లు, ఆఫీసులు, కుమారుల ఇళ్లు, ఆఫీసులు, కంపెనీలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైస్‌ మిల్లుల్లో సోదాలు చేస్తున్నారు. మిర్యాలగూడతోపాటు ఆలియాలోని రైస్‌ మిల్లులో తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిసింది. ఉదయం మొదలైన దాడులు ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్పందించిన భాస్కరరావు..
కాగా, ఐటీ దాడులపై ఎమ్మెల్యే భాస్కరావు స్పందించారు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని తెలిపారు. తనను ఐటీ అధికారులు ఎవరూ కలవలేదని తెలిపారు. రైస్‌ మిల్లులపై దాడులు జరుగుతున్నాయని, ఆ మిల్లులతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన బంధువులు ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరగలేదని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేకనే కేంద్రంలోని బీజేపీ ఇలా ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. తన వద్ద డబ్బులు లేవని, ఉన్నట్లు నిరూపించాలని సవాల్‌ చేశారు.

పరిస్థితి చూస్తుంటే ఎన్నికలు ముగిసే వరకూ ఈ ఐటీ దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగుతున్న ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమవై ఎవరైనా ఫిర్యాదులు చేశారా అని ఆరా తీస్తున్నారు.