KA Paul: కేఏ పాల్ ట్రస్ట్ లో చిన్నారులను ఇబ్బంది పెట్టేవారా? జగ్గారెడ్డి పై ఎందుకు కేసు నమోదయింది?

ఇప్పుడంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా, మీడియాలో సోషల్ మీడియాలో జోకర్ గా కేఏ పాల్ కనిపిస్తున్నాడు గాని.. ఒకప్పుడు అతడు మత ప్రబోధకుడు. దేశ విదేశాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రైస్తవుడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 16, 2023 12:42 pm

KA Paul

Follow us on

KA Paul: ఇది ఇంట్రెస్టింగ్ వార్త. జనాలకు ఇన్నాళ్లు తెలియని వార్త. కాంగ్రెస్ సంగారెడ్డి అభ్యర్థి జగ్గారెడ్డి బయటి ప్రపంచానికి చెప్పిన వార్త. ఇంతకీ ఆయన చెప్పిందంటే.. ప్రస్తుత ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంగారెడ్డి ప్రాంతంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రస్ట్ చిన్నారులను ఏం చేసేది? ఆ వ్యవహారంలోకి జగ్గారెడ్డి ఎందుకు ఎంటర్ కావలసి వచ్చింది? చివరికి ఏం జరిగింది? ఇంత జరుగుతున్నా కేఏ పాల్ ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల అఫిడవిట్లో జగ్గారెడ్డి దీనినే ప్రముఖంగా ఎందుకు పేర్కొన్నారు? ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ విషయం ఎందుకు హాట్ టాపిక్ గా మారింది?

ట్రస్ట్ పెట్టారు

ఇప్పుడంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా, మీడియాలో సోషల్ మీడియాలో జోకర్ గా కేఏ పాల్ కనిపిస్తున్నాడు గాని.. ఒకప్పుడు అతడు మత ప్రబోధకుడు. దేశ విదేశాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రైస్తవుడు. అలాంటి కేఏ పాల్ సంగారెడ్డి ప్రాంతంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టులో అనాధ పిల్లలను సంరక్షించేవారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించేవారు. వసతి కూడా కల్పించేవారు. అయితే కేఏ పాల్ దీనిని తనకు నమ్మకమైన వ్యక్తుల చేతుల్లో పెట్టి.. ఆ ట్రస్ట్ నిర్వహణకు అవసరమయ్యే డబ్బులను పంపించేవారు. అప్పుడప్పుడు ఆ ట్రస్ట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడేవారు. అయితే ఇలా ట్రస్ట్ కొన్ని సంవత్సరాలు పాటు బాగానే నడిచింది. ఇక్కడ వసతి పొందిన పిల్లలు మంచి మంచి స్థానాల్లో నిలిచారు. రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కాబట్టి అక్కడ ట్రస్ట్ ను చూస్తున్న కొంతమందిలో దుర్బుద్ధి పుట్టింది. వారు అక్కడి ఆడపిల్లలను వేధించడం మొదలుపెట్టారు. కొద్ది రోజులపాటు దీనిని మౌనంగా భరించిన ఆ పిల్లలు.. ఆ తర్వాత ఈ విషయాన్ని సభ్య సమాజం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పెద్దగా స్పందన రాకపోవడంతో ఆ విషయం కాస్త జగ్గారెడ్డి వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత కొత్త రూపు దాల్చింది.

పిల్లలు చెప్పడంతో..

ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించేందుకు జగ్గారెడ్డి అక్కడికి వెళ్లారు. అక్కడ వసతి పొందుతున్న పిల్లలతో మాట్లాడారు. ఆ తర్వాత ఆ పిల్లలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ నిర్వహించి కొద్ది రోజులపాటు ట్రస్ట్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న కేఏ పాల్ జగ్గారెడ్డి మీద ఫైర్ అయ్యారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ ట్రస్ట్ కార్యకలాపాలపై అటు పాల్, ఇటు జగ్గారెడ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కొంత కాలానికి అక్కడి ట్రస్టును కేఏ పాల్ మూసివేశారు. కాగా ఇప్పటికీ ఆ కేసు జగ్గారెడ్డి మీద అలాగే కొనసాగుతోంది. అయితే ఇదే విషయాన్ని తన ఎన్నికల అఫిడవిట్లో జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో.. అక్కడి మీడియా ప్రతినిధులు ఈ ప్రశ్నను అడగగా జగ్గారెడ్డి పై విధంగా సమాధానం చెప్పారు. కాగా, ట్రస్ట్ వివాదానికి సంబంధించి జగ్గారెడ్డి తొలిసారిగా నోరు విప్పడంతో గతంలో ఏం జరిగింది అనే దానిపై చాలామంది ఆరా తీస్తున్నారు. మొత్తానికి నాటి ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.