Israel: చరిత్రలోనే ఎరుగని అత్యంత భయానక దాడికి గురైన ఇజ్రాయిల్‌లో.. హమాస్ ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. తాజా దాడిలో వారు పారాగ్లైడర్లుగా దిగి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. అసాధారణ నిఘాకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ ఈ విపత్తును ఊహించలేకపోయిందా? దీని సమాధానం కానే కాదని తెలుస్తోంది. పారాగ్లైడర్లతో దాడి కుట్ర గురించి 2014 జూన్‌లోనే ఇజ్రాయిల్‌కు తెలిసింది. నాడు గాజాలో పట్టుబడిన హమాస్ కమాండర్ ఈ విషయం చెప్పాడు. మోటారుతో పనిచేసే పారాచూట్ల ఆధారంగా దాడికి దిగేందుకు హమాస్ ఇతడితో పాటు 10 మందిని 2010లోనే మలేసియా పంపి శిక్షణ ఇప్పించింది. ప్రతి ఐదు నెలలకు ఆయుధ శిక్షణ కూడా పొందాడు. మరోవైపు కొందరు ఉగ్రవాదులను పనివారుగా విదేశాలకు పంపి.. అక్కడి టెక్నాలజీని నేర్చుకునేలా హమాస్ వ్యూహం పన్నింది. అనంతరం గాజాస్ట్రిప్ లోనే శాశ్వత శిబిరం ఏర్పాటు చేసింది. కానీ, పారాగ్లైడర్స్ దాడులకు దిగకపోవడంతో ఇజ్రాయెల్ ఉదాసీనంగా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్న హమాస్.. వందల పారాగ్లైడర్లను రంగంలోకి దింపింది. వారు దిగుతూనే కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొన్నారు. ఆత్మాహుతికి సైతం సిద్ధంగా ఉన్న ఈ పారాగ్లైడర్లు.. ప్రజలు, సైనికులను బందీలుగా చేసుకున్నారు.
దాడి వెనుక.. నాటో కట్టడికి రష్యా వ్యూహం!
పారాగ్లైడింగ్ దళాలు రష్యా వద్ద కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హమాస్ దాడి వెనుక ఆ దేశం పాత్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాడేందుకు సిరియా సహకారంతో లెబనాన్, పాలస్తీనా యువతను రష్యా నియమించుకుంది. ప్రతిగా హమా్‌సకు సాయం చేసిందనే కథనాలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో కూటమి పెద్దఎత్తున ఆయుధ సాయం చేస్తోంది. ఇజ్రాయెల్‌లో చిచ్చు రేపడం ద్వారా.. కూటమి దృష్టిని మళ్లించాలనే వ్యూహంతో హమా్‌సకు లెబనాన్, సిరియా ద్వారా రష్యా ఆయధాలు ఇచ్చిందని.. నిఘా సమాచారం పంచుకుందని పేర్కొంటున్నారు. యుద్ధం తీవ్రమైతే అత్యంత సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలను పంచాల్సి వస్తుంది. అందుకే హమాస్ దాడిలో రష్యా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌లో అధికార, ప్రతిపక్షాలు ఏకమై.. అత్యవసర ప్రాతిపదికన జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి.
నిఘా ఘోర వైఫల్యం!
కొంతకాలంగా బలహీన పడిన హమాస్ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే సంచలన దాడికి దిగింది. కానీ, దీన్ని పసిగట్టడంలో ఇజ్రాయెల్ దేశీయ నిఘా సంస్థ షిన్ బెట్, విదేశాల్లో గూఢచార్యానికి పేరుగాంచిన మొస్సాద్ తీవ్రంగా విఫలమాయ్యయి. న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై నిరసనలు సహా ఇజ్రాయెల్‌లో నెలకొన్న రాజకీయ విభేదాలు కూడా ఈ పరిస్థితికి కారణమయ్యాయి. మంత్రులైతే.. ఇంటిలిజెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి పౌరుడికి అతడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.