Congress: మొదట 30 మందికి టికెట్లు ఇచ్చామని చెప్పారు. మిగతా చోట్ల సంప్రదింపులు చేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత 45 మందికి టికెట్లు దాదాపుగా ఓకే చేశామని వివరించారు. కొద్దిరోజులకు ఈ సంఖ్య 60 కి చేరింది. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఓవైపు భారత రాష్ట్ర సమితి ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ సైతం దాదాపుగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. అధికారంలోకి వస్తామని, భారత రాష్ట్ర సమితిని పడగొడతామని ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేకపోతోంది. కేవలం మీడియాకు లీకులు ఇవ్వడంతోనే సరిపెడుతోంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కు మ్ములాటలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి ఆధ్వర్యంలో కమ్మ సామాజిక వర్గం నాయకులు తమకు మెజారిటీ స్థానాలు కేటాయించాలని ఇప్పటికే అధిష్టానం వద్ద పెద్ద పంచాయతీ పెట్టారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కమ్మ సామాజికవర్గానికి ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. పలు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లపై నేతల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, కమిటీ చైర్మన్ వారికి సర్ది చెప్పారని, వాటిపై మరోసారి స్ర్కీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారని తెలిసింది.
కాగా, టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని, బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. స్ర్కీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో టీపీసీపీ ప్రతిపాదించిన పేర్లు, రాష్ట్ర ఎన్నికల కమిటీ నుంచి వచ్చిన అభ్యర్థుల జాబితా, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్‌తోపాటు ఇతర అభ్యర్థలనల్నీ పరిశీలించామన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడంపై, ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశాలపై చర్చించామని, వీలైనంత త్వరలో జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ)కి అందజేస్తామని అన్నారు. వారు పరిశీలించి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారని తెలిపారు.
వీలైనంత త్వరలో తొలి జాబితా..
వీలైనంత త్వరలో సీఈసీ.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేస్తుందని మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. ఎంత మంది అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటిస్తామనేది మాత్రం చెప్పలేమన్నారు. ప్రతి సమావేశంలో దీనిపై చర్చ జరుగుతుందని, అభ్యర్థుల పేర్లను చేర్చడం, తీసివేయడం వంటివి జరుగుతూనే ఉంటాయని అన్నారు. సీఈసీ భేటీకి ముందే స్ర్కీనింగ్ కమిటీ మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని కుటుంబ సభ్యులు నడిపిస్తున్నందున ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి సీట్లు కేటాయిస్తారని, కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటుందని, దాని ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఠాక్రే చెప్పారు. సీఈసీ ఆమోదం పొందే వరకు ఏ జాబితా కూడా ఫైనల్ కాదని స్పష్టం చేశారు. విద్యార్థి నేతలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, ఓయూ విద్యార్థి నేతల డిమాండ్‌లో తప్పేమీ లేదని అన్నారు. స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్ధిఖీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీ విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఎలాంటి ఎత్తుగడకు తెరతీస్తుందో అనేది వేచి చూడాల్సి ఉంది.