Israel: సరిగ్గా 50 ఏళ్ల కిందట.. 1973, అక్టోబరు 6న ఇజ్రాయైల్‌పై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు నుంచి ఈజిప్టు, మరోవైపు నుంచి సిరియా విరుచుకుపడ్డాయి. ఈ యుద్ధానికి ఎవరికి తగ్గట్లు వారు పేరు పెట్టుకున్నారు. కొంతమంది దీన్ని అక్టోబరు యుద్ధమని, మరికొందరు యామ్ కిప్పూర్ యుద్ధమని, ఇంకొందరు రమదాన్ యుద్ధమని, ఇతరులు నాలుగో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధమని పిలిచారు. పేరు ఏదైనా ఈ యుద్ధం మధ్య ఆసియానే కాదు యావత్ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపింది.
అమెరికా మద్దతులో..
కొత్తగా ఏర్పడి.. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల మద్దతుతో 3 సార్లు అరబ్ దేశాలను ఓడించి ఇజ్రాయెల్ మంచి ఊపుమీదున్న దశలో అనూహ్యంగా ఈ యుద్ధం వచ్చింది. సైనాయ్ ద్వీపకల్పాన్ని మళ్లీ స్వాధీనం చేసుకునేందుకు ఈజిప్టు, గోలన్ హైట్స్ కోసం సిరియా ఈ యుద్ధానికి దిగాయి. ఈ రెండు ప్రాంతాలనూ అంతకుముందు 1967లో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. వాటిని తిరిగి సంపాదించేందుకు ఈజిప్టు, సిరియా దాడులు మొదలు పెట్టాయి. ఇది ఇజ్రాయెల్ ఊహించని పరిణామం. అదీ యూదులకు అత్యంత పవిత్రమైన యామ్ కిప్పూర్ దినాన దాడి జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఈ దాడులకు కారణమని చెబుతారు. అరబ్ దేశాలకు సోవియట్ యూనియన్ ఆయుధాలు అందించగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలిచింది.
10 రోజుల తర్వాత..
అనుకోని దాడితో తొలుత ఇజ్రాయెల్ వెనుకంజ వేసింది. ఈజిప్టు, సిరియా దళాలు దూసుకొచ్చాయి. అయితే అమెరికా అన్నివిధాలుగా సాయం చేయడంతో ఇజ్రాయెల్ పుంజుకుంది. అమెరికా నిఘా సమాచారాన్ని అందివ్వడంతోపాటు విమానాల్లో భారీ ఎత్తున ఆయుధాలను దింపింది. పది రోజుల తర్వాత అంటే 1973, అక్టోబరు 16న ఇజ్రాయెల్ దళాలు ఈజిప్టు, సిరియా రక్షణ రేఖలను ఛేదించి యుద్ధంపై పట్టు సంపాదించాయి. ఈజిప్టుకు ఆర్థిక జీవం అయిన సూయజ్ కాలువపై పట్టు బిగించడం మొదలు పెట్టాయి.
చమురు అస్త్రం సంధించి..
అమెరికా అండతో యుద్ధం 12వ రోజుకు చేరుకోగానే అరబ్ దేశాలు చమురు అస్త్రాన్ని ప్రయోగించాయి. చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతోపాటు అమెరికాకు సరఫరాపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. వెంటనే అమెరికా చాణుక్యుడిగా పేరొందిన అప్పటి విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ రంగంలోకి దిగారు. సోవియట్ పాత్రను తగ్గిస్తూ ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య చక్కర్లు కొడుతూ ఇరుపక్షాల మధ్య దౌత్యం నెరిపారు. మొత్తానికి యుద్ధాన్ని ఆపించి అరబ్, ఇజ్రాయెల్ శాంతించేలా చేశారు. అది కిసింజర్ ‘షటిల్ దౌత్యం’గా (కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ చేసిన దౌత్యం) పేరొందింది.
ఇజ్రాయెల్‌ను గుర్తించిన ఈజిప్టు..
అక్టోబరు 25న కాల్పుల విరమణ ప్రకటించారు. అమెరికా దౌత్యనీతి కారణంగా ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య 1978లో ఒప్పందం కుదిరింది. సైనాయ్ ద్వీపకల్పాన్ని ఈజిప్టుకు అప్పగించారు. 1979లో ఈ రెండు దేశాలూ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్‌ను చట్టబద్ధ దేశంగా ఈజిప్టు ప్రకటించింది. ఓ అరబ్ దేశం ఇజ్రాయెల్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. ఆ తర్వాతి కాలంలో ఈజిప్టు క్రమంగా సోవియట్ యూనియన్ నీడలోంచి బయటకు రావడం గమనార్హం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌దే పైచేయి అయినా ఆ దేశాన్ని కంగు తినిపించామనే ఆనందం అరబ్ దేశాల్లో వ్యక్తమవుతుంటుంది. అందుకే అక్టోబరు యుద్ధానికి వారు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ యుద్ధానంతరం ఇజ్రాయెల్ రాబోయే ముప్పును దృష్టిలో ఉంచుకుని తన స్వీయ బలాన్ని భారీగా పెంచుకుంది.
పాలస్తీనాపై వైఖరిలో సడలింపు..
పొరుగు దేశం పాలస్తీనాపై ఇజ్రాయెల్‌కు ఉన్న వైఖరిలోనూ కాస్త సడలింపు వచ్చింది. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జోరుగానే సాగాయి. కానీ అవి ఫలించలేదు. ఇరు దేశాల మధ్య చిచ్చు ఆరడం లేదు. పెద్దగానో, చిన్నగానో ఘర్షణలు తరచూ సాగుతునే ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మళ్లీ ఇజ్రాయెల్‌పై పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ దాడులు చేయడం గమనార్హం.