Petro Price Cut: దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల నుంచి కాస్త ఊరట. రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్ ధరను చూసి బెంబేలెత్తుతున్న పేద మహిళలకు కొద్దిగా ఉపశమనం. అంతర్జాతీయ పరిణామాలతో ఎరువుల ధరలపై గుబులు పెట్టుకున్న అన్నదాతకు కొంత భరోసా.. ఆకాశంలో ఉన్న ఇనుము, ఉక్కు ధరలను చూసి.. ఇల్లు కట్టుకోవాలనే కలను అణచివేసుకుంటున్న సామాన్యుడికి శుభవార్త. మొత్తానికి.. ధరాభారంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను కేంద్ర ప్రభుత్వం కనికరించింది. కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో 9 కోట్లమంది ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీంతో కొంత భారం తగ్గనుంది. అయితే దీనిపై సరికొత్త వాదన వినిపిస్తోంది. శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు లేకున్నా, భారత్ లో ధరలు మండుతుండటం, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. పెరుగుదలకు ప్రధానకరణంగా భావించే ఇంధనంపై పన్నులను ఎత్తేసింది. ఇది శుభవార్తలా అనిపించినా.. పెట్రో ధరల తగ్గింపు వల్ల ఏర్పడిన లోటును పూడ్చుకోడానికి కేంద్రం కొత్తగా రూ.లక్ష కోట్లు అప్పులు చేయనున్నట్లు షాకింగ్ న్యూస్ వెలువడింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసిన కేంద్రం.. ఆ కోతల వల్ల ఏర్పడిన రూ.లక్ష కోట్ల ఆదాయ లోటు భర్తీకి సిద్ధమవుతున్నది. మార్కెట్ రుణాల ద్వారా ఈ లోటు భర్తీ చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్థంలో కొత్తగా రూ.1లక్ష కోట్ల అప్పులు తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. జీఎస్‌టీ వసూళ్లు బాగున్నా ఎరువులు, ఆహార సబ్సిడీ బిల్లూ ఈ ఆర్థిక సంవత్సరం భారీగా పెరగనుంది. దీంతో పెట్రో పన్ను కోత ద్వారా ఏర్పడిన రూ.లక్ష కోట్ల ఆదాయ లోటును మార్కెట్ రుణాల ద్వారా సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిత్యావసరాల ధరల నుంచి ప్రజలకు కొంతవరకూ విముక్తి లభించింది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.14.3 లక్షల కోట్లు సమీకరించబోతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్‌లోనే ప్రకటించారు. అయితే పెట్రో సుంకం తగ్గింపు కారణంగా ఇప్పుడు ఆ ఖాతా మరో రూ.లక్ష కోట్లు పెరగనుంది. దీంతో రుణ పత్రాల మార్కెట్ మరింత వేడెక్కి.. దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్థిక మంత్రి వెల్లడి..
పన్నలు తగ్గింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఐరన్, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీని, ప్లాస్టిక్ ఉత్పత్తులు- ముడి పదార్థాలతో పాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించనున్నట్టు తెలిపారు. ఇనుము, ఉక్కు ధరలను తగ్గించే దిశగా.. వాటి ముడిపదార్థాలు, ఇంటర్మీడియరీస్‌పై కస్టమ్స్ డ్యూటీని క్రమాంకనం చేస్తున్నామని.. ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గిస్తామని కూడా తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తామని చెప్పారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరిచేందుకు.., మెరుగైన రవాణా ద్వారా దాని ధరను తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.లక్ష కోట్లు, ఉజ్వల సిలిండర్‌పై రాయితీతో రూ.6,100 కోట్ల మేర రాబడి తగ్గుతుందని నిర్మల పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రాలు సైతం పెట్రోల్/డీజిల్‌పై స్థానిక పన్నులు/ వ్యాట్‌ను తగ్గించాలని నిర్మలా అభ్యర్థించారు.నవంబరులో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా.. ఆ మేరకు పన్నులను తగ్గించని రాష్ట్రాలకు ఈసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. 14.2 కిలోల ఉజ్వల్ కల్యాణ్ యోజన సిలిండర్‌పై తాజాగా ఇస్తున్న రూ.200 రాయితీ లబ్ధిదారుల ఖాతాల్లో పడుతుంద న్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరు రూ.10.91 తగ్గి.. రూ.108.58కి కానుంది. డీజిల్ 7.64 తగ్గి రూ.97.85కి రానుంది. రాష్ట్ర రాజధానిలో ఇప్పటివరకు లీటరు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉంది. గతేదాడి నవంబరులో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించగా.. 25 రాష్ట్రాలు/యూటీలు స్పందించి స్థానిక పన్నులను తగ్గించాయి. కానీ, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ మేరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక నాటి తగ్గింపుతో.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 137 రోజుల పాటు పెట్రోల్/డీజిల్ రేట్లను పెంచలేదు. 14 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్ 84 డాలర్ల నుంచి 140 డాలర్లకు పెరిగినా ధరలు మార్చలేదు. అయితే, ఈ ఏడాది మార్చిలో దీనికి బ్రేక్ పడింది. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధర రూ.10 మేర పెరిగింది. ఏప్రిల్ 6తో దీనికి అడ్డుకట్ట పడింది.

Also Read: Power Cut In Pawan Kalyan Press Meet: పవర్ కట్ తో పకపక నవ్విన పవన్ కల్యాణ్?
ఎరువులపై రాయితీ..
అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో.. దేశ రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.10 లక్షల కోట్ల ఎరువుల రాయితీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్‌లో పేర్కొన్న రూ.1.05 లక్షల కోట్ల సబ్సిడీ కంటే ఇది రెట్టింపు. కాగా, అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పడిపోయిన, కొవిడ్ లాక్‌డౌన్ కొనసాగిన 2020 మార్చి-మే నెలల్లో కేంద్రం పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. నాడు రికార్డు స్థాయిలో.. ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.32.9కి, డీజిల్‌పై రూ.31.8కి చేరింది. అయితే, 2021 నవంబరులో పెట్రోల్‌పై సుంకాన్ని రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 తగ్గించింది. మొత్తంగా చూస్తే.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కొవిడ్‌కు పూర్వం నాటి స్థితికి తీసుకొచ్చింది. తాజా తగ్గింపుతో.. లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.19.9కి, డీజిల్ మీద రూ.15.8కి పడిపోయింది.

Also Read: KCR- Modi: ఈ సారి కూడా ప్రధానిని సీఎం కలవడం లేదా?
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s

