Homeఆంధ్రప్రదేశ్‌MLC Driver Subrahmanyam: డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే.. ఇంతకీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ఏమైనట్టు?

MLC Driver Subrahmanyam: డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే.. ఇంతకీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ఏమైనట్టు?

MLC Driver Subrahmanyam: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారణ అయింది. రోడ్డు ప్రమాదమంటూ ఎమ్మెల్సీ చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోయింది. పోస్టుమార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతుమీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విపరీతంగా కొట్టడంతో శరీరంలోని కొన్ని అంతర్గత అవయవాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. మంగళగిరిలోని రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు కొన్ని శాంపిల్స్‌ను సోమవారం పంపనున్నారు. వాటి ఫలితాలొచ్చాక పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తారు. ఇంకోవైపు.. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కానీ అరెస్టు చూపకుండా తాత్సారం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కోర్టు సెలవు కావడంతో సోమవారం మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టి.. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీని ఆదివారం కలిసినట్లు సమాచారం. అలాగే ఉదయభాస్కర్‌ కూడా వైసీపీ పెద్దలతో మంతనాలు జరిపారని.. బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి.. పరారీలో ఉన్న ఉదయభాస్కర్‌ శనివారం మధ్యాహ్నం రాజవొమ్మంగిలో విలేకరుల సమావేశంలో హత్య గురించి వివరించేందుకు నిర్ణయించుకున్నారని.. కానీ ఓ పోలీసు ఉన్నతాధికారి సూచనలతో రద్దు చేసుకున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం పూర్తి కాకుండా వివరాలు వెల్లడిస్తే చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఎమ్మెల్సీని హెచ్చరించినట్లు సమాచారం.

MLC Driver Subrahmanyam
Subrahmanyam

ముమ్మర దర్యాప్తు..

సుబ్రహ్మణ్యాన్ని ఎలా చంపారు.. ఎందుకు చంపారు.. ఎక్కడ చంపారో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ బీచ్‌వద్ద చంపి ఉంటే అది ఎక్కడ అనేది ఆరా తీస్తున్నారు. దీనిపై ఉదయభాస్కర్‌తోపాటు హత్య జరిగిన సంఘటన స్థలంలో ఉన్న ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మద్యం మత్తులో చంపారా.. లేదా పథకం ప్రకారమే అంతమొందించారా అనేది ఆరా తీస్తున్నారు.సుబ్రహ్మణ్యం రోడ్డుప్రమాదానికి గురయ్యాడని, కాకినాడ అమృత ఆస్పత్రికి తరలించి కారులోనే ఉంచి వైద్యుడితో పరీక్ష చేయిస్తే చనిపోయాడని నిర్ధారించారని ఉదయభాస్కర్‌.. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ కారులో ఆస్పత్రికి వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పటికే వైద్యులతో ఫోన్లో మాట్లాడడంతో.. వాళ్లు బయటకు వచ్చి కారు వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుబ్రహ్మణ్యాన్ని ఏడు నిమిషాలపాటు పరీక్షించి.. చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో 1.40 గంటలకు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకెళ్లిపోయినట్లు సీసీటీవీలో గుర్తించారు. నాగమల్లితోట జంక్షన్‌ వద్ద ప్రమాదం జరిగిందని ఉదయభాస్కర్‌ చెప్పడంతో అక్కడి సీసీ ఫుటేజీని కూడా పరిశీలించారు. కానీ ఆ రోజు అక్కడ రోడ్డు ప్రమాదమేదీ జరగలేదని సర్పవరం సీఐ తన దర్యాప్తులో తేల్చారు. దీనిని బట్టి ముందే హత్య చేసి రోడ్డు ప్రమాదమనే కట్టుకథ అల్లారని.. అది నిజమని చెప్పడానికి కావాలనే మృతదేహాన్ని అమృత ఆస్పత్రి వద్దకు తెచ్చినట్లు తెలుస్తోంది.

MLC Driver Subrahmanyam
MLC Ananta Satya Uday Bhaskar

Also Read: CM KCR- Early Elections: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లనున్నారా?

అంత్యక్రియలు పూర్తి..

ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను అరెస్టు చేస్తామని, హత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించిన దరిమిలా శనివారం అర్ధరాత్రి కుటుంబసభ్యులు శవపంచనామాకు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఒంటిగంట సమయంలో ఈ ప్రక్రియను వైద్యులు ప్రారంభించారు. శవపంచనామా మొత్తాన్ని వీడియోగ్రఫీ చేశారు. పోస్టుమార్టం ఆదివారం తెల్లవారుజామున 2.50 గంటలకు పూర్తయింది. పోలీసులు మూడు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భౌతిక కాయాన్ని సుబ్రహ్మణ్యం స్వగ్రామమైన పెదపూడి మండలం గొల్లల మామిడాడకు అంబులెన్సులో తరలించారు. అయితే కుటుంబసభ్యులు లేకుండానే పోలీసులు మృతదేహాన్ని తరలించడంతో నిరసన వ్యక్తమైంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: Rishabh Pant- DRS: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచిన కెప్టెన్ పంత్!

Recommended Videos:

వనజీవి రామయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ || Padmasri Vanajeevi Ramaiah Phone Call With Pawan Kalyan

జనసేన కోసం మెగా ఫ్యాన్స్ ఐక్యత..|| Mega Fans Support to Janasena || Pawan Kalyan || Ok Telugu

https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version