ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో బొత్స సత్యనారాయణ వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ఆయన కదలికలపై వైసీపీ సొంత మీడియాలోనే విభిన్న కథనాలు వస్తున్నాయి. దీంతో ఆయన విషయంపై పార్టీ కూడా లోతుగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. మాటిమాటికి బొత్స ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇందులో నిజం ఎంతో అబద్దం ఎంతో తెలియడం లేదు. వైసీపీ వర్గాల్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పై సొంత మీడియాలోనే వ్యతిరేక వార్తలు వచ్చినట్లు ఇప్పుడు బొత్సపై కూడా అదే తీరుగా వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా జరిగితే ఇతర మీడియాలో వచ్చే వార్తలు ప్రస్తుతం సొంత మీడియాలోనే రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో మంతనాలు జరిపే అవకాశం బొత్సకు లేదని తెలిసినా అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం బలమైన నేతగా ఉన్న బొత్సపై ఇలాంటి పుకార్లు రావడం యాదృచ్ఛికమేమీ కాదు. ఆయన ప్రాధాన్యతను తగ్గించే క్రమంలో వైసీపీ నాయకులే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ప్రస్తుతం విజయసాయిరెడ్డికే ప్రాధాన్యం ఉంది. దీంతో బొత్సను ఎలాగైనా బలహీనంగా చేసే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. బొత్స అధిష్టానంపై కుట్ర చేయడం అబద్దమని పలువురు చెబుతున్నారు. అదే సందర్భంలో వైసీపీలో అంతర్గతంగా బొత్సపై కుట్ర జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.