బీజేపీ-జనసేన పొత్తు ఉందా?

బీజేపీ-జనసేన రెండు వేర్వేరు పార్టీలు కాదు. మిత్రపక్షం అన్నమాట. ఏది చేసినా కలిసే చేయాలి. ఇక నుంచి ఏ పనైనా సంయుక్తంగా చేస్తామని పొత్తు ఖరారు చేసుకున్న రోజు మీడియా ముందు గొప్పలు చెప్పుకున్నారు. వైసీపీని కలిసే ఎదుర్కొంటామని పేర్కొన్నాయి. కానీ ప్రస్తుతం రెండు పార్టీలు ఎడమొహం పెడమొహంగా కనిపిస్తున్నాయి. అభిప్రాయభేదాలు బయట పడుతున్నాయి. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రత్నప్రభకు కనీసం డిపాజిట్ కూడా […]

Written By: Srinivas, Updated On : June 17, 2021 5:50 pm
Follow us on

బీజేపీ-జనసేన రెండు వేర్వేరు పార్టీలు కాదు. మిత్రపక్షం అన్నమాట. ఏది చేసినా కలిసే చేయాలి. ఇక నుంచి ఏ పనైనా సంయుక్తంగా చేస్తామని పొత్తు ఖరారు చేసుకున్న రోజు మీడియా ముందు గొప్పలు చెప్పుకున్నారు. వైసీపీని కలిసే ఎదుర్కొంటామని పేర్కొన్నాయి. కానీ ప్రస్తుతం రెండు పార్టీలు ఎడమొహం పెడమొహంగా కనిపిస్తున్నాయి. అభిప్రాయభేదాలు బయట పడుతున్నాయి. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రత్నప్రభకు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి పన్ను పెంచారని బీజేపీ తెగ బాధపడుతోంది. పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారా అంటూ నిలదీస్తోంది. వ్యాక్సిన్ల పేరుతో పెట్రోల్ ధరలు కేంద్రం భారీగా పెంచడాన్ని మాత్రం సమర్థించుకోవడం విడ్డూరమే. బీజేపీ చేపట్టిన ఈ ఉద్యమంలో జనసేన లేకపోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అసలు జనసేనకు బీజేపీతో కలవడం ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కల్యాణ్ అందుబాటులో లేరు కాబట్టి కనీసం కార్యకర్తలైనా బీజేపీతో కనిపించడం లేదు. జనసేన అంటే పవన్ కల్యాణేనా. నాయకులు, కార్యకర్తలు ఉండరా అని అందరు ప్రశ్నిస్తున్నారు. జన సైనికులు బీజేపీకి అవసరం లేదా? అసలు పొత్తు ఉందా? లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఆందోళనలు జరిగే సమయంలో ఒక్క జనసేన జెండా కూడా కనిపించడం లేదంటే పరిస్థితి ఏంటో అర్థమైపోతోంది.

జనసేన కూడా చెత్త పన్నుపై స్పందించింది. అయితే కేవలం పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేసింది. తరువాత బీజేపీ ఆందోళన చేపట్టి తమ పార్టీ మాత్రమే హైలెట్ అయ్యేలా చూసుకుంది. ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మినహా ఇంకెవరికీ బీజేపీతో పొత్తులో భాగంగా సీట్లు ఇవ్వరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.