Balineni Srinivasa Reddy: వైసీపీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కథ ముగిసినట్టేనా? ఆయన రెక్కలు విరిచే ప్రయత్నంలో నాయకత్వం ఉందా? పొమ్మనలేక పొగ పెడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు సైతం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఆ మధ్యన పార్టీలో దిక్కర స్వరం వినిపించిన బాలినేని హై కమాండ్ పెద్దలు బుజ్జగించారు. పార్టీలో కొనసాగేలా చేశారు. అటు జిల్లా ఇన్చార్జిగా నియమితులైన విజయ్ సాయి రెడ్డి సైతం.. ఇకనుంచి ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనివేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే హై కమాండ్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బాలినేని అనుచరులను బయటకు నెట్టే ప్రయత్నాల్లో ఉంది.
నాలుగు జిల్లాల సమన్వయకర్తగా ఉన్న బాలినేని కొద్దిరోజుల కిందట పార్టీ పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయేసరికి మనస్థాపంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. ఒకానొక దశలో బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఎలాగోల పార్టీలో కొనసాగుతూ వచ్చారు. విజయ్ సాయి రెడ్డి నాలుగు జిల్లాల సమన్వయకర్తగా నియమితులైన తర్వాత బాలినేనికి ప్రాధాన్యం లభిస్తూ వచ్చింది. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి సమక్షంలోనే బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు మాగుంట కుటుంబమే తప్పించి.. మరెవరూ కాదని తేల్చేశారు. ఈ కామెంట్స్ పొలిటికల్ గా వైరల్ అయ్యాయి.
ఇది గడిచి నెలరోజులు కాకమునుపే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న బాలినేని అనుచరులు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురవుతున్నారు. తాజాగా బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. కనీసం బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాలినేని హై కమాండ్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సస్పెండ్ చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటలు టార్గెట్ విధించారు. లేకుంటే సీఎం జగన్ ను కలిసి తేల్చుకుంటానని హెచ్చరించారు.
అయితే రెండు రోజుల కిందటే కొందరి మార్పులు అనివార్యమని సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే కొత్తవారికి టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో బాలినేని పై చర్చ నడుస్తోంది. సీఎం జగన్ కు తెలియకుండా ఇద్దరు కీలక నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కచ్చితంగా సీఎం అనుమతి తీసుకునే వేటు వేసి ఉంటారని ప్రచారం సాగుతోంది. అయితే జిల్లాలో బాలినేని ప్రాధాన్యం తగ్గించేందుకు వైవి సుబ్బారెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు దిక్కర స్వరం వినిపిస్తున్న బాలినేని ని వదులుకునేందుకు సీఎం జగన్ దాదాపు ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు తాను కలిసేందుకు సీఎం జగన్ అనుమతి ఇవ్వకపోతే బాలినేని కీలక నిర్ణయం దిశగా అడుగులేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.