Telangana Elections 2023: గ్రేటర్ హైదరాబాదులో పట్టు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎంలు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. అధికార బీఆర్ఎస్ ఉప్పల్, మల్కాజిగిరి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి బరిలో దించింది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రేటర్లో 22 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఎక్కడికక్కడే ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నా.. సామాజిక, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఇందులో నలుగురికి ఆశించిన చోట్ల టిక్కెట్లు దక్కలేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ కోసం రోహిన్ రెడ్డి రెండుసార్లు ప్రయత్నించిన దక్కలేదు. మూడోసారి అనూహ్యంగా అంబర్పేట టికెట్ దక్కింది. టిపిసిసి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న మొగిలి సునీతముదిరాజ్ ఖైరతాబాద్ టిక్కెట్ ని ఆశించారు. కానీ ఆమెకు గోషామహల్ కేటాయించారు. శేరిలింగంపల్లి బిఆర్ఎస్ టికెట్ ఆశించిన బండి రమేష్ కు బెర్త్ దక్కలేదు.దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ శేరిలింగంపల్లి టిక్కెట్ బదులు కూకట్పల్లి కేటాయించారు.
కాంగ్రెస్ పార్టీ ఈసారి గ్రేటర్ లో బలమైన అభ్యర్థులను రంగంలో దించింది. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు నగరంలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2018లో మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ వారిద్దరూ బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి నగరంలో దిక్కుమొక్కు లేకుండా పోయింది. అయితే గత పదేళ్లుగా పాలన అందిస్తున్న కేసీఆర్ సర్కార్ పై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. నగర ఓటర్లు కావడంతో వ్యతిరేకత బాహటంగానే కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో.. ఆ పార్టీకి ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో బలమైన నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేసే క్రమంలో.. చాలాచోట్ల అసంతృప్తులు బయటకు వచ్చారు. బాహటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కనిపిస్తోంది. అసంతృప్త నేతలను స్థానిక అభ్యర్థులే కలుస్తూ కలిసి పని చేద్దామని ప్రతిపాదన పెడుతున్నారు. అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే గత రెండు ఎన్నికల కంటే ఈసారి గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.