Revanth Reddy: తెలంగాణలో టిడిపి క్యాడర్ ఎటువైపు? ఈ చర్చ గత కొద్దిరోజులుగా జరుగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ పార్టీ మద్దతు ఎవరికీ అనేది మిస్టరీగా మారింది.ఇటీవల చంద్రబాబు పేరుతో ఫేక్ ప్రకటన ఒకటి విడుదలైనట్లు టిడిపి గుర్తించింది. దానిని సవరించుకుంటూ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రకటనతో లెక్క లేకుండా క్యాడర్ ఒక నిర్ణయానికి వచ్చింది.ఒకటి ఏపీరాజకీయాల ప్రభావం,మరొకటి రేవంత్ రెడ్డి కారణం.
తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి మంచి మార్కు చూపించగలిగారు.ఆయనకు ఏపీలో సైతం టిడిపిలో అభిమానులు ఉన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి దృష్ట్యా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని.. ఒక్కరోజు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయలేదని.. ఇప్పటికీ పాజిటివ్ భావంతో ఉండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి ని విపరీతంగా అభిమానిస్తున్నాయి. ఈ విషయంలోనే బిఆర్ఎస్ తో పాటు ఇతర నేతలు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటారు. ఆయన చంద్రబాబు మనిషిగా చెబుతుంటారు. కానీ ఎప్పుడూ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విమర్శలను ఖాతరు చేసిన సందర్భాలు లేవు. చంద్రబాబు విషయంలో తన అభిప్రాయాన్ని ఓపెన్ గానే చెబుతుంటారు.
తెలంగాణ ఎన్నికలవేళ ఇండియా టుడే చర్చా గోష్టిలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ ఛానల్ యాంకర్ వైఎస్ గొప్ప నేత అన్నట్లుగా చెప్పుకొచ్చారు.అయితే దీనిపై రేవంత్ రెడ్డి అదే స్పీడ్ తో రియాక్ట్ అయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే కాదు.. చంద్రబాబు, జైపాల్ రెడ్డి, పీవీ నరసింహారావు లాంటి వాళ్ళు ఇంకా గొప్ప నేతలు ఉన్నారని తేల్చేశారు. చంద్రబాబు విషయంలో తాను అనుకున్నది చెప్పేందుకు రేవంత్ రెడ్డి వెనుకడుగు వేయలేదు. అటు అమరావతిని ఒక గొప్ప రాజధానిగా అభివర్ణించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికలవేళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనంలో చూడలేం.గతంలో సైతం చంద్రబాబు విషయంలో రేవంత్ రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. తాను అతనిపై విమర్శలు చేయలేనట్టు కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో టిడిపి ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వేళ… టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు చూడడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఆయన సీఎం అయితే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న.. టిడిపి అభిమానులు సైతం ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్కు అనుకూల పవనాలతో పాటు టిడిపి క్యాడర్ బలం తోడైతే ఏకపక్ష విజయం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే తెలంగాణలో టిడిపి నాయకత్వం ఏ ప్రకటన చేస్తుందా? అన్న అనుమానంలో ఇతర రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఒకవేళ ప్రత్యేక ప్రకటన రాకుంటే మాత్రం.. కాంగ్రెస్ పార్టీకి గుంప గుత్తిగా ఓట్లు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.